కొత్తగూడెం అర్బన్, జూలై 17 : ప్రధాని మోదీ ఎన్నికల హామీలో భాగంగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారని, తీరా గద్దెనెక్కాక ఇచ్చిన హామీని విస్మరించారని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ ఫహీం అన్నారు. గురువారం సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ వర్షంలో ఆందోళన నిర్వహించారు. కలెక్టరేట్ లోకి చొచ్చుకుపోయేందుకు నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఫహీం మాట్లాడుతూ.. కులం, మతం పేరుతో యువతను రెచ్చగొడుతూ ప్రధాని మోదీ మోసం చేస్తున్నారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్లు కాదు కదా, రెండు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం నూతన విద్యా హక్కు చట్టంను తీసుకువచ్చి బడుగు బలహీనర్గాలకు విద్యను దూరం చేస్తున్నట్లు దుయ్యబట్టారు.
రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ చూస్తోందన్నారు. రాజ్యాంగంలో ఒక్క అక్షరాన్ని మార్చిన ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇస్తానన్న హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. లేదంటే కార్పొరేషన్ ల ద్వారా రుణాలు మంజూరు చేయాలన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఖయ్యాం, అధ్యక్షుడు హరీశ్, సతీశ్, ఉపేందర్, చాంద్ పాషా, చంద్రగిరి ప్రసాద్, పడిపర్తి రాజు, శ్రీనివాస్, జాకీర్, మలోత్ అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.
Kothagudem Urban : మోదీ ఇచ్చిన హామీని నెరవేర్చాలి : మహమ్మద్ ఫహీం