వడోదరా : డబ్ల్యూటీటీ యూత్ కంటెండర్ టోర్నీలో భారత యువ ప్లేయర్లు దివ్యాంశి భౌమిక్, సిండ్రెలా దాస్ శుభారంభం చేశారు. శుక్రవారం మొదలైన టోర్నీలో బాలికల అండర్-17 సింగిల్స్ లీగ్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ దివ్యాంశి 11-4, 11-1,11-2తో నిజా కామత్‌పై అలవోక విజయం సాధించింది. గతేడాది ఇదే టోర్నీలో అండర్-15తో పాటు అండర్-17 టైటిళ్లు దక్కించుకున్న దివ్యాంశి ఆది నుంచే తనదైన దూకుడు కనబరుస్తూ వరుసగా మూడు గేముల్లో ప్రత్యర్థిని చిత్తుచేసింది. మరో సింగిల్స్‌లో సిండ్రెలా 11-6, 11-6, 11-2తో తానియా కర్మాకర్‌పై ఘన విజయం సాధించింది.
జపాన్ టీటీ ప్లేయర్ మికు మత్సుషిమా 11-6, 11-3, 11-8తో అన్వి గుప్తాపై గెలిచి నాకౌట్లోకి ప్రవేశించింది. బాలుర అండర్-17 విభాగంలో టాప్‌సీడ్ రిత్విక్ గుప్తా 11-9, 11-5, 11-5తో ధృవా మల్లిఖార్జున్‌పై గెలిచాడు. లోకల్ ప్యాడ్లర్ వేద్ పంచల్ వరుసగా రెండు గేముల్లో గెలిచి గ్రూపులో అగ్రస్థానంలో నిలిచాడు. బాలుర అండర్-13 విభాగంలో శౌర్య గోయల్ 10-12, 11-9, 13-11, 7-11, 11-6తో సుచేత్ ధర్నెవార్పై గెలిచి ముందంజ వేశాడు.