సెంచూరియన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్లో దక్షిణాఫ్రికా ఫైనల్ చేరింది. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో సఫారీలు థ్రిల్లింగ్ విక్టరీ సాధించి ఈ టోర్నీలో సగర్వంగా ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 148 పరుగుల ఛేదనలో భాగంగా ఓవర్ నైట్ స్కోరు 27/3తో ఐదో రోజు ఆట ఆరంభించిన సౌతాఫ్రికా.. ఒకదశలో 95/4తో పటిష్ట స్థితిలోనే నిలిచింది. కానీ ఐదు పరుగుల వ్యవధిలో ఆ జట్టు ఏకంగా 4 వికెట్లు కోల్పోవడంతో ఒక్కసారిగా పాకిస్థాన్ గెలుపు రేసులోకి వచ్చింది. మహ్మద్ అబ్బాస్ (6/54) అద్భుత బౌలింగ్‌తో సఫారీలను ఆందోళనకు గురిచేశాడు. కానీ లోయరార్డర్లో అనుభవజ్ఞుడైన కగిసొ రబాడా (26 బంతుల్లో 31 నాటౌట్, 5 ఫోర్లు), మార్కో యాన్సెన్ (24 బంతుల్లో 16 నాటౌట్, 3 ఫోర్లు) దక్షిణాఫ్రికాను (150/8) విజయతీరాలకు చేర్చారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడం ఆ జట్టుకు ఇదే తొలిసారి. ఈ సైకిల్లో మరో మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ బవుమా సేన.. 66.67 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. సఫారీలు లార్డ్స్‌కు టికెట్ బుక్ చేసుకున్న నేపథ్యంలో రెండో జట్టు ఏదని సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (58.89 శాతం), భారత్ (55.88 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.