WTC Points Table | బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. పెర్త్ టెస్ట్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దాంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై టీమిండియా ఆశలు సజీవంగా ఉన్నాయి. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరాలంటే టీమిండియా మరో మూడు మ్యాచుల్లో విజయం సాధించాలి. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ అనంతరం టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. పాయింట్ల శాతం 58.33 నుంచి 61.11కి చేరింది. ఆస్ట్రేలియా 13 మ్యాచుల్లో నాలుగో ఓటమితో రెండోస్థానానికి పడిపోయింది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 90 పాయింట్లు ఉన్నాయి. 15 మ్యాచుల్లో భారత్‌కు ఇది తొమ్మిదో విజయం. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 110 పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, వెస్టిండిస్ జట్లు నిలిచాయి.
బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భాగంగా పెర్త్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌లో భారత్ ఘన విజయాన్ని అందుకున్నది. టీమిండియా 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆసిస్ 238 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరు వికెట్ల నష్టానికి 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మొత్తం కలిపి 533 పరుగుల ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, శుభ్‌మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగి.. జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 2021లో గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా.. తాజాగా అక్కడే విజయాన్ని అందుకున్నది. ఇంతకు ముందు ఆప్టస్ స్టేడియంలో జరిగిన నాలుగు టెస్టులు ఆడియన ఆసిస్.. ఇంట్లో విజయాన్ని నమోదు చేసింది. ఐదో టెస్ట్‌లో భారత్ జట్టుపై పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ పలు చారిత్రాత్మక మ్యాచ్‌లను గెలుచుకున్నది.