WTC Points | ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్- వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పట్టికలో 12 పాయింట్లు పెరిగాయి. రెండో టెస్టుకు ముందు 40 పాయింట్లు ఉండగా.. తాజా విజయంతో 52కి చేరాయి. అయినప్పటికీ ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో భారత్ మూడో స్థానంలోనే కొనసాగుతున్నది. అయితే, పాయింట్ల శాతం 55.56శాతం నుంచి 61.90శాతానికి పెరిగింది. న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా ఈ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఇంకా ఒక్క టెస్ట్ ఆడదు. ప్రస్తుతం పాక్-దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ కొనసాగుతున్నది.
తాజా గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియా 100శాతం విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. అప్పటి వరకు ఆడిన మూడు టెస్టుల్లో మూడింటిని గెలిచి.. 36 పాయింట్లు, వంద పాయింట్లశాతంతో తన ఆధిక్యాన్ని పదిలం చేసుకుంది. త్వరలో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో తలపడబోతున్నది. పాయింట్ల పట్టికలో ఒక విజయం, ఒక ఓటమితో శ్రీలంక రెండోస్థానంలో ఉన్నది. ఈ జట్టు పాయింట్ల శాతం 66.67గా ఉంది. ఇక భారత జట్టు ఆరు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో మూడవ స్థానంలో ఉంది. ఢిల్లీ టెస్ట్ గెలిచిన తర్వాత, టీమిండియా పాయింట్లు 52కి పెరిగాయి. కానీ పాయింట్ల శాతం ఆధారంగా.. శ్రీలంక కంటే వెనుకబడి ఉన్నది. భారత జట్టు స్థానం ప్రస్తుతం బలపడగా.. మొదటి రెండు స్థానాలకు చేరుకునేందుకు దక్షిణాఫ్రికాతో జరగబోయే టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికాపై సైతం ఇదే ఊపును కొనసాగిస్తే 2027 ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరడం అంత కష్టమేమీ కాదు.
ఇంగ్లండ్ ఇక రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో 43.33 పాయింట్ల శాతంతో నాలుగో స్థానంలో ఉన్నది. ఇక బంగ్లాదేశ్, వెస్టిండిస్ చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ రెండు మ్యాచుల్లో ఒక టెస్ట్‌ను మాత్రమే డ్రా చేసుకుంది. 16.67శాతం పాయింట్ల శాతం ఉన్నది. వెస్టిండిస్ ఇప్పటి వరకు ఆడిన ఐదు టెస్టుల్లోనూ ఓటమిపాలైంది. పాయింట్ల శాతం సున్నాకు చేరింది. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ (2025-2027)లో ప్రతి మ్యాచ్ ఫలితం ఆధారంగా జట్లకు పాయింట్లు ఇస్తారు. ఒక మ్యాచ్‌లో విజయం సాధిస్తే 12 పాయింట్లు.. డ్రా అయితే నాలుగు, టై అయితే ఆరు పాయింట్లు ఇస్తారు. మొత్తం ర్యాంకింగ్ పాయింట్ల ద్వారా మాత్రమే కాకుండా.. పాయింట్ పర్సంటేజ్ సిస్టమ్ (PCT) ద్వారా నిర్ణయిస్తారు.