న్యూఢిల్లీ: లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్‌పై ఫోకస్ పెట్టి తిరిగి మ్యాట్‌పైకి రావాలని నిర్ణయించిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) షాకిచ్చింది. అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ నుంచి తిరిగి వచ్చే అథ్లెట్లు పూర్తి చేయాల్సిన ఆరు నెలల నోటీసు గడువును పాటించనందున జూన్ 26 వరకు ఆమెను దేశీయ పోటీల్లో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటించింది. అంతేకాకుండా క్రమశిక్షణా రాహిత్యం, డోపింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణల కింద ఆమెకు 15 పేజీల షోకాజ్ నోటీసు జారీ చేసింది. దాంతో యూపీలోని గొండాలో ఆదివారం మొదలయ్యే నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో ఆడే అవకాశాన్ని ఫొగాట్ కోల్పోయింది. ఇక, వినేశ్‌కు ఇచ్చిన నోటీసులో డబ్ల్యూఎఫ్ఐ సంచలన ఆరోపణలు చేసింది.
2024 పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో బరువు పెరగడం వల్ల అనర్హతకు గురై భారత రెజ్లింగ్ ప్రతిష్టకు వినేశ్ నష్టం కలిగించిందని ఆరోపించింది. ఆ మెగా ఈవెంట్లో భారత్ గెలవాల్సిన పతకం ఆమె నిర్లక్ష్యం కారణంగా కోల్పోయిందని పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా 2024 మార్చిలో నిర్వహించిన ట్రయల్స్‌లో ఒకేసారి రెండు వెయిట్ కేటగిరీల్లో పోటీ పడటం, రెండు సార్లు డోపింగ్ పరీక్షలకు అందుబాటులో లేకపోవడం (2024 సెప్టెంబర్ 25, 2025 డిసెంబర్ 18) వంటి అంశాలను కూడా ప్రస్తావించింది.
గతంలో బరువు నిర్వహణలో విఫలమైన ఇతర రెజ్లర్లపై కూడా తాము చర్యలు తీసుకున్నామని, వినేశ్ విషయంలోనూ నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించబోమని డబ్ల్యూఎఫ్ఐ స్పష్టం చేసింది. వినేశ్ 2024 డిసెంబర్ 14న తాను ఆగస్టు 2025 వరకు విరామంలో ఉంటానని తెలిపినప్పటికీ, నిబంధనల ప్రకారం రీఎంట్రీకి కనీసం ఆరు నెలల ముందుగా అధికారికంగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని రెజ్లింగ్ సమాఖ్య స్పష్టం చేసింది. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు వినేశ్‌కు 14 రోజుల సమయం ఇచ్చింది. కాగా, షోకాజ్ నోటీసుపై పోరాటం చేస్తానని వినేశ్ సోషల్ మీడియా పోస్టులో తెలిపింది.