WFI Elections: గత కొంతకాలంగా దేశ క్రీడా రంగంలో వివాదాలకు కేంద్రంగా మారిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) కు ఎట్టకేలకు ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగైదు నెలలుగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను డిసెంబర్ 21న నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి జస్టిస్ (రిటైర్డ్) ఎం. ఎం. కుమార్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల పోలింగ్‌తో పాటు ఫలితాలనూ అదే రోజు సాయంత్రం వెల్లడిస్తామని కుమార్ తెలిపారు.డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలను ఈ ఏడాది ఆగస్టు 7న రూపొందించిన ఎన్నికల జాబితా ప్రకారమే నిర్వహిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలపై పంజాబ్ – హర్యానా హైకోర్టుపై కేసు పెండింగ్‌లో ఉంది. హర్యానా రెజ్లింగ్ అసోసియేషన్ (హెడ్డబ్ల్యూఎ), హర్యానా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ మధ్య నెలకొన్న వివాదం కారణంగా డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలు వాయిదా పడ్డ విషయం విదితమే. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అభ్యర్థులు ఆందోళనకు గురికావాల్సిన పన్లేదని.. ఎన్నికలు పాత పద్ధతిలోనే జరుగుతాయని కుమార్ తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అతడిని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది.