Wrestlers Protest | మహిళా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో లైంగిక వేధింపులు, పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. అయితే, తాను ఏ తప్పు చేయలేదని, కోర్టు, పోలీసులపై పూర్తిగా నమ్మకం ఉందన్నారు. దీని వెనుక ఓ వ్యాపారవేత్త హస్తం ఉందని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. ఎఫ్ఐఆర్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి.
ఏడుగురు రెజ్లర్లలో ఇద్దరు తమను బ్రిజ్ భూషణ్ అసభ్యంగా తాకాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తున్నది. ఊపిరి ఎలా తీసుకోవాలో చెబుతూ.. కడుపు, ఛాతిభాగాన్ని తప్పుగా తాకుతూ ఉండేవాడని, 2016లో ఓ టోర్నమెంట్ సమయంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెస్టారెంట్లో తన ఛాతీ, పొట్ట భాగాన్ని అనుచితంగా తాకినట్లుగా ఓ మహిళా రెజ్లర్ తెలిపింది. భయంతో ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదని తెలిపినట్లు సమాచారం. అలాగే 2018లో ఓసారి కౌగిలించుకున్నాడని మరో రెజ్లర్ ఆరోపించినట్లుగా తెలుస్తున్నది. మహిళా రెజ్లర్ల ఫిర్యాదుపై పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.
మరో వైపు రెజ్లర్లు బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేసే వరకు ఆందోళన కొనసాగించాలని భావిస్తున్నారు. తమకు న్యాయం జరగకుంటే ఒలింపిక్, ఆసియా క్రీడల్లో తమకు లభించిన పతకాలు, అవార్డులను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వనున్నట్లు హెచ్చరించారు. బజరంగ్, సాక్షి మాలిక్ దేశంలోనే నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని సైతం అందుకున్నారు. అలాగే బజరంగ్, సాక్షి మాలిక్, వినేష్ ముగ్గురూ దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అందుకున్నారు. ఇదిలా ఉండగా.. రెజర్ల ఆందోళన శనివారంతో 14వ రోజుకు చేరింది.