లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మరో పోరు అభిమానులను అలరించింది. శనివారం డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం యూపీ 6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిస్తే..వరుసగా ఐదో ఓటమి ఖాతాలో వేసుకున్న ఆర్సీబీ(4) లీగ్ నుంచి వైదొలిగింది.
ఇదిలా ఉంటే ఢిల్లీ(10), గుజరాత్(8), ముంబై(8) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. పరుగుల వరద పారిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 225/5 స్కోరు చేసింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోరుగా ఇది రికార్డుల్లోకెక్కింది. ఓపెనర్ జార్జియా వోల్(56 బంతుల్లో 99 నాటౌట్, 17ఫోర్లు, సిక్స్) సూపర్ సెంచరీతో కదంతొక్కింది.
అయితే ఆఖర్లో పరుగు తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఆర్సీబీ బౌలర్లను ఉతికి ఆరేస్తూ జార్జియా కొట్టిన కొట్టుడుకు స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. తన ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, ఓ భారీ సిక్స్‌తో చెలరేగిన జార్జియా జట్టుకు రికార్డు స్కోరు అందించింది. జార్జియా వేర్హామ్(2/43) రెండు వికెట్లు తీసింది. లక్ష్యఛేదనకు దిగిన ఆర్సీబీ 19.3 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. రీచా ఘోష్(69) ఒంటరిగా పోరాడినా లాభం లేకపోయింది. ఎకల్‌స్టోన్(3/25), దీప్తి(3/50)రాణించారు. ధనాధన్ సెంచరీతో అదరగొట్టిన జార్జియాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.