WPL-2024 | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ -2024) రెండో ఎడిషన్ ప్రారంభ మ్యాచ్ హోరాహోరీ సాగింది. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి బంతి వరకు నువ్వా.. నేనా.. అన్నట్లు సాగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 172 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ సరిగ్గా 20 ఓవర్లలో పూర్తి చేసింది. చివరి ఓవర్లో ముంబై ఇండియన్స్ గెలవడానికి 12 పరుగులు అవసరం. కాగా, ఎలీస్ క్యాప్సీ వేసిన ఈ ఓవర్లో ముంబై ఇండియన్స్ రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది. చివరి బంతిని సజన సిక్సర్ గా మలవడంతో ముంబై ఇండియన్స్ విజియం సాధించింది. ముంబై ఇండియన్స్ సారధి హర్మన్ ప్రీత్ కౌర్ (55), యస్తికా భాటియా 57 పరుగులు చేశారు. నాట్ స్కివెర్ 19, అమెలియా కెర్ 24 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు అరుంధతీ రెడ్డి రెండు, ఎలిస్ కాప్సీ రెండు, మరిజన్నె, షికా పాండే చెరో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ఎలీస్ కాప్సే 75 పరుగులు, ఓపెనర్ కం సారధి మెగ్ లానింగ్ 31 పరుగులు, జెమీమా రోడ్రిగ్స్ 42 పరుగులు చేశారు. మరిజన్నె కాప్ వేగంగా తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లతో కలిపి 16 పరుగులు చేశారు. ముంబై ఇండియన్స్ బౌలర్లు నాట్ స్కివెర్ బ్రంట్, అమేలియా కేర్ రెండేసీ వికెట్లు, షబ్నిమ్ ఇస్మాయిల్ ఒక వికెట్ తీసుకున్నారు.