World Wrestling Chief : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat)కు జరిగిన అన్యాయాన్ని క్రీడాలోకమంతా ఖండిస్తోంది. ఫైనల్‌కు ముందు 100 గ్రాముల అదనపు బరువు ఉందనే సాకుతో అనర్హురాలిగా ప్రకటించడం సమంజసం కాదని భారత్ వాదిస్తోంది. ఇప్పటికే భారత ఒలింపిక్ సంఘం (IOC) తమ నిరసనను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం వరల్డ్ రెజ్లింగ్ చీఫ్(World Wrestling) నెనడ్ లలోవిక్ (Nenad Lalovic) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రూల్ అంటే రూల్. వినేశ్ ఫోగట్ విషయంలో ఏమీ చేయలేం అని కుండబద్ధలు కొట్టేశాడు.
‘ఒలింపిక్స్‌లో రూల్ అంటే రూల్. విశ్వక్రీడల నియమాలను మనందరం గౌరవించాలి. అయితే.. భారత రెజ్లర్ విషయంలో జరిగినదానికి నాకు చాలా బాధగా ఉంది. ఉండాల్సిన బరువు కంటే ఆమె కొంచెమే ఎక్కువ ఉంది. కానీ, ఎవరికైనా రూల్ ఒక్కటే. ఈ విషయంలో మేము ఏమీ చేయడానికి లేదు. యథావిధిగా పోటీలు కొనసాగుతాయి’ అని లలోవిక్ వెల్లడించాడు.
వినేశ్ ఫోగట్‌ను ఓదార్చుతున్న పీటీ ఉష
ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో వినేశ్ అదిరే ప్రదర్శన చేసింది. వరల్డ్ నంబర్ 1 సుసానీపై, ఉక్రెయిన్ రెజ్లర్‌పై విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లోనూ క్యూబా రెజ్లర్‌ను 5-0తో మట్టికరిపించి తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దాంతో, ఈసారి వినేశ్ ఫోగట్ స్వర్ణం గెలుస్తుందని యావత్ దేశమంతా భావించింది.
అయితే.. ఊహించని విధంగా అధిక బరువు ఉందని ఆమెపై ఒలింపిక్స్ నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. దాంతో, భారత దేశమంతా ఒక్కసారిగా షాక్‌కు గురి అయింది. లింగ పరీక్షలో పాస్ కాని అల్జీరియా బాక్సర్ ఇమనె ఖెలిఫ్ దర్జాగా ఆడొచ్చు కానీ, 100 గ్రాముల అదనపు బరువు సాకుతో వినేశ్‌ను తప్పిస్తారా? అంటూ క్రీడా విశ్లేషకులు, సెలబ్రిటీలు ఒలింపిక్స్ నిర్వాహకులపై మండిపడుతున్నారు.