ఆదిలాబాద్, ఆగస్టు 7(నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తమ్మిడిహట్టి బరాజ్ (Tammidihatti) పనులను త్వరలో ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఆయన అనంత రం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు సాగునీరు అందుతుందన్నారు. ఐటీడీఏలను పరిపుష్టి చేయడానికి చర్యలు చేపట్టామని, బడ్జెట్లో గిరిజన సంక్షేమానికి రూ.17 వేల కోట్లను కేటాయించినట్లు తెలిపారు. ఐటీడీఏల ద్వారా గిరిజనులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
త్వరలో 35 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గిరిజనులతోపాటు గిరిజనేతరులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కుప్టీ ప్రాజెక్టు నిర్మాణంతోపాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతుల భూములకు సాగునీరు అందించడానికి నిధులు మంజూరు చేశామన్నారు