మిర్యాలగూడ, మార్చి 16 : చదరంగంలో భారత ఆధిపత్యానికి తిరుగులేదని మరోసారి నిరూపిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పదేండ్ల గుండా కార్తికేయ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 180 చెస్ బోర్డులపై ఏకధాటిగా అత్యంత వేగంగా పావులు కదుపుతూ కేవలం 9.41 నిమిషాల్లోనే చెక్‌మేట్ పెట్టి నోబెల్ బుక్ ఆఫ్ రికార్డులలో చోటు సంపాదించుకున్నాడు. గతంలో నారా దేవాన్ష్.. 11.59 నిమిషాల్లో నెలకొల్పిన రికార్డును తాజాగా కార్తికేయ బ్రేక్ చేశాడు. మిర్యాలగూడకు చెందిన గుండా మహేశ్, చంద్రకళ దంపతలు కుమారడైన కార్తికేయ.. స్థానిక సంస్కృతిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం యాద్గార్‌పల్లిలోని డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోటీలలో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులుగా అంతర్జాతీయ చెస్ క్రీడాకారులైన ఆశా, అంకిత్ గౌడ్, అరవింద్ సమక్షంలో ఈ పోటీలు జరిగాయి.