Salman Khan | ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసుకున్న టీమ్ఇండియాపై ప్రశంసల వర్షం కురుస్తున్నది. స్వదేశంలో జరుగుతున్న మెగాటోర్నీలో దంచికొడుతున్న భారత జట్టుపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌పై విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన భారత జట్టుపై సల్మాన్ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా సారథి రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని సల్మాన్ ఆకాశానికి ఎత్తాడు.
వీరిద్దిరి దూకుడుకు ఫిదా అయిన సల్మాన్ తన చిత్రాల్లోని క్యారెక్టర్లతో వాళ్లను పోల్చిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పరుగులు యంత్రం విరాట్ కోహ్లీకి.. దబాంగ్ క్యారెక్టర్ సరిగ్గా సరిపోతుందని సల్మాన్ అన్నాడు. దబాంగ్ సినిమాలో పోషించిన పోలీస్ పాత్రకు ఉన్న లక్షణాలన్నీ విరాట్‌లో ఉన్నాయని పేర్కొన్నాడు. ఆ క్యారెక్టర్లో ఉండే దమ్ము.. దుందుడుకు స్వభావం.. ఎవరినీ లెక్క చేయని తత్వం కోహ్లీకి సరిగ్గా సరిపోతాయని వ్యాఖ్యానించాడు.
ఇక టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అయితే మరో బజరంగీ భాయ్‌జాన్ అని సల్మాన్ కితాబిచ్చాడు. సారథ్య బాధ్యతలు మోస్తూనే.. ఆటగాడిగా అదరగొడుతున్నాడని అన్నాడు. రోహిత్ అద్భుతమైన ఆటగాడు అని.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. జట్టుకు విజయం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాడని ప్రశంసించాడు. ఇక పుష్కర కాలం తర్వాత భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఆరు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఇందులో రెండు రోహిత్, కోహ్లీ రెండేసి మ్యాచ్‌ల్లో సత్తాచాటిన విషయం తెలిసిందే!