Virat Kohli | టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో పెట్టుకుంటే.. పరిస్థితులు తారుమారు కావడానికి ఎక్కువ సమయం పట్టదని బంగ్లా సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ అన్నాడు. అతడిలో ప్రతి మ్యాచ్ గెలువాలనే కసి ఉంటుందని.. అతడిని రెచ్చగొడితే అంతు చూసే వరకు వదిలి పెట్టడని సహచరులకు సూచించినట్లు ముష్ఫికర్ వెల్లడించాడు. కోహ్లీ మైదానంలో ఏ మాత్రం తగ్గే రకం కాదని అతడిని వదిలేయడమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు.
ఛేదనలో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్ విరాట్ అని.. క్రీజులో అడుగు పెట్టాక అతడిని రెచ్చగొడితే.. దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ముష్ఫికర్ అన్నాడు. అందుకే తన జట్టు సభ్యులకు ఈ విషయం చెప్పానని కోహ్లీని అలా వదిలేయాలని అతడి జోలికి పోయి అనవసరంగా ప్రమాదం కొని తెచ్చుకోకూడదని ముష్ఫికర్ అన్నాడు. కాస్త అవకాశం ఇచ్చినా మ్యాచ్ను లాగేసుకోవడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నాడు.