క్రికెట్ అభిమానులకు కనువిందు చేసే ఐసీసీ ప్రపంచ కప్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. 2011 వరల్డ్ కప్ ఫేమ్ సచిన్ టెండూల్కర్‌ను మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఐసీసీ గ్లోబల్ అంబసిడార్గా నియమించుకున్నది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు సచిన్ టెండూల్కర్.. మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీతో స్టేడియం అంతా కలయతిరుగుతారు అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
భారతీయుల క్రికెట్ ఆరాధ్య దైవం.. సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. వరల్డ్ కప్ టోర్నీలకు ఎల్లవేళలా తన హ్రుదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. త్వరలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్-2023 టోర్నీ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. ‘1987లో బాల్ బాయ్ గా వ్యవహరించిన నేను.. ఆరు ప్రపంచ కప్ టోర్నీలకు భారత్ తరపున టీంకు ప్రాతినిధ్యం వహించా. 2011లో వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవడం నా క్రికెట్ ప్రయాణంలో గర్వ కారణంగా నిలుస్తుంది’ అని సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించారు.
సచిన్ టెండూల్కర్‌తోపాటు వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్, సౌతాఫ్రికా ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ వరల్డ్ కప్ విజేత సారధి ఎయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియాకు చెందిన అరోన్ ఫించ్, శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్, న్యూజీలాండ్ రాస్ టేలర్,టీం ఇండియా బ్యాటర్ సురేష్ రైనా, మహిళా టీం మాజీ సారధి మిథాలీ రాజ్, పాక్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ కూడా ఐసీసీ అంబసిడార్లుగా వ్యవహరిస్తారు.