గ్వాంగ్జు (దక్షిణ కొరియా): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్స్‌లో తొలిరోజే భారత్ పతకాల గురి పెట్టింది. దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా మొదటి రోజు భారత పురుషుల కాంపౌండ్ జట్టుతో పాటు మిక్స్డ్ టీమ్ ఈవెంట్స్‌లో ఫైనల్ చేరి పతకాలను ఖాయం చేసుకుంది. పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో రిషభ్ యాదవ్, అమన్ సైనీ, ప్రథమేశ్‌తో కూడిన భారత త్రయం.. ఆస్ట్రేలియా, యూఎస్ఏ, టర్కీని ఓడించి ఫైనల్ చేరింది.
ఆస్ట్రేలియాతో పోరు 232-232తో సమమైనా షూటాఫ్‌లో భారత్ 30-28 ఆధిక్యంతో ఆ జట్టును ఓడించింది. ఆ తర్వాత 234-233తో యూఎస్ఏను చిత్తుచేసి సెమీస్‌లో 234-232తో టర్కీని ఓడించి మెడల్ ఖాయం చేసుకుంది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రిషభ్, ఆంధ్రా అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ద్వయానికి తొలి రౌండ్లో బై దక్కగా రెండో రౌండ్లో 160-152తో జర్మనీని మట్టికరిపించింది. క్వార్టర్స్‌లో 157-153తో ఎల్ సాల్వెడార్ను సెమీఫైనల్లో 157-155తో చైనీస్ తైఫీని ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది.