‘కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు’ అన్నట్లు భారత క్రికెట్ చీఫ్ కోచ్ గౌతం గంభీర్ పేలవ ప్రస్థానానికి వేల ప్రశ్నలు! ఏ ముహూర్తాన టీమ్ఇండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడో గానీ ఎవరూ కలలో ఊహించని పరాజయాలను గంభీర్ మూటగట్టుకున్నాడు. దిగ్గజ రాహుల్ ద్రవిడ్ తర్వాత భారీ అంచనాలతో కోచ్‌గా వచ్చిన గంభీర్ అంతే వేగంగా ప్రభ కోల్పోతున్నాడు. మెంటార్‌గా 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలువడంలో కీలకంగా వ్యహహరించిన గంభీర్ అదే ఊపుతో భారత జట్టుకు కొత్త జోష్ తీసుకొస్తాడని అందరూ ఊహించారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అంతోఇంతో నెట్టుకొస్తున్న ఈ మాజీ క్రికెటర్.. టెస్టుల్లో ఘోర ఓటములను చవిచూస్తున్నాడు. ఇప్పటి వరకు గంభీర్ కోచ్‌గా 11 టెస్టులాడిన టీమ్ఇండియా ముచ్చటగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఏడింటిలో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్‌పై రెండు మ్యాచ్‌లు, ఆస్ట్రేలియాపై ఒకటి గెలిచిన భారత్ తమ టెస్టు ప్రస్థానంలో ఎన్నడూ ఊహించని రీతిలో ఓడి విమర్శల పాలైంది. తాజాగా ఇంగ్లండ్‌తో లీడ్స్ టెస్టులోనూ భారత్ చేజేతులా ఓడి సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయింది.
భారత క్రికెట్ జట్టులో ప్రతిభ కల్గిన ప్లేయర్లకు కొదువలేదు. కావాల్సిందల్లా వారిని సరైన మార్గంలో నడిపించడమే. ఇక్కడ కావాల్సింది మెండైన అనుభవమే. రవిశాస్త్రి, అనిల్‌కుంబ్లే, రాహుల్ ద్రవిడ్ కోచింగ్ శైలిని చూసిన భారత క్రికెట్ అభిమానులకు గౌతం గంభీర్ స్టయిల్ ఏ కోశాన నచ్చడం లేదు. తాను భారత్‌కు ఆడే సమయంలోనే మిగతా ప్లేయర్లతో పోలిస్తే మైదానంలో అందరికంటే భిన్నంగా కనిపించిన గంభీర్ కోచింగ్‌లోనూ కొత్త హంగులు తీసుకొస్తాడని సగటు అభిమాని ఆశించాడు. కానీ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా సాగుతున్నది. వచ్చి రావడంతోనే ఒక్కో సీనియర్ ప్లేయర్‌కు చెక్ పెట్టుకుంటూ వచ్చిన గంభీర్ తనదైన టీమ్‌ను తయారు చేసుకోవడంలో ఒకింత సఫలీకృతడయ్యాడు.
ముఖ్యంగా ‘రొకో’ ద్వయంగా పేరొందిన రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీని పొమ్మనకుండా పొగపెట్టి అనుకున్నది సాధించాడు. అంతగా అనుభవం లేని శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా చేయడంలో కీలకంగా వ్యవహరించిన గంభీర్.. టీమ్ఇండియాను గెలుపు బాట పట్టించలేకపోతున్నాడు. ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పటి టీమ్ఇండియాకు.. ఇప్పటి జట్టుకు స్పష్టమైన తేడా కనిపిస్తున్నది. రవిశాస్త్రి, ద్రవిడ్ కోచింగ్‌లో ప్లేయర్లందరూ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తూ ఎంతటి ప్రత్యర్థినైనా మట్టికరిస్తామన్న ధీమాతో ఉండేవారు. కానీ గంభీర్ రంగప్రవేశంతో సీన్ పూర్తిగా మారిపోయింది. స్వదేశంలో బంగ్లాదేశ్‌పై టెస్టు సిరీస్ మినహాయిస్తే.. ఇప్పటి వరకు గంభీర్ కోచింగ్‌లో చెప్పుకోదగ్గ విజయాలేమీ లేకపోవడం గమన్హారం.
గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత భారత్ టెస్టుల్లో సాధించిన విజయాలకంటే, ఎదుర్కొన్న అపజయాలే ఎక్కువ. సుదీర్ఘ దేశ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఎదురవ్వని ఓటములను టీమ్ఇండియా మూటగట్టుకుంది. ముఖ్యంగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌పై మూడు టెస్టుల్లో క్లీన్‌స్వీప్ పరాజాయం. పుట్టి బుద్ది ఎరిగినప్పటి నుంచి కివీస్‌పై టీమ్ఇండియాకు ఇదే ఘోరాతి ఘోర ఓటమి. కివీస్ క్రికెటర్లు కలలో ఊహించని విధంగా భారత్ మూడింటికి మూడు మ్యాచ్‌ల్లో ఓడి చారిత్రక పరాజయాన్ని తమ పేరిట లిఖించుకుంది. తాము తవ్వుకున్న బొందలో తామే పడ్డట్లు స్పిన్‌తో కివీస్ రెక్కలు విరుద్దామనుకున్న గంభీర్ ప్లాన్లు బెడిసికొట్టిన వేళ కెప్టెన్‌గా రోహిత్‌శర్మ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. చారిత్రక సిరీస్ సొంతం చేసుకున్న కివీస్..పెట్టనికోట లాంటి భారత్‌ను వారి సొంతగడ్డపై ఓడించడం కలలో కూడా ఊహించలేదని, ఇది మాకు ప్రపంచకప్ కంటే గొప్ప విజయమని అన్నారంటే మన ఓటమికి ఎంత విలువుందో అర్థమవుతుంది.
ఇక్కడే గంభీర్ కోచింగ్ పతనానికి నాంది పడింది. తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(బీజీటీ)లో టీమ్ఇండియా సిరీస్ ఓటమి. అప్పటి వరకు వరుసగా రెండు సార్లు ఆస్ట్రేలియాను వారి సొంత ఇలాఖాలోనే మట్టికరిపించి హ్యాట్రిక్ లక్ష్యంగా బరిలోకి దిగిన టీమ్ఇండియా ఎవరూ ఊహించని రీతిలో ఓటమిపాలైంది. ఆసీస్‌కు దుర్బేధ్యమైన కోటగా పేరుగాంచిన పెర్త్‌లో విజయదుందుభి మోగించిన భారత్.. సిరీస్‌లో అదే ఒరవడి కొనసాగించలేకపోయింది. రోహిత్ గైర్హాజరీలో పెర్త్‌లో చారిత్రక విజయాన్నందించిన బుమ్రా..తన అద్భుత బౌలింగ్‌తో కంగారూలకు ముచ్చెమటలు పట్టించాడు. సిరీస్‌లో మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓడి ఒక డ్రా చేసుకున్న రోహిత్‌సేన దశాబ్దంలో తొలిసారి ఆసీస్‌కు సిరీస్‌ను అప్పగించింది. వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారాడంటూ సిరీస్‌లో ఆఖరిదైన సిడ్నీ టెస్టులో రోహిత్‌శర్మను తప్పించిన గంభీర్ తాను అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో ఒడవని ముచ్చట.
బెడిసికొడుతున్న ప్రయోగాలు : గంభీర్ చేస్తున్న ప్రయోగాలు మొదటికే మోసం చేస్తున్నాయి. తాను చీఫ్ కోచ్‌గా రావాలంటే వీళ్లు ఉంటేనే వస్తానంటూ బోర్డుకు షరతులు పెట్టి సాధించుకున్న గంభీర్..అనుకున్న ఫలితాలు సాధించడంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. బీజేపీ పెద్దల మద్దతుతో ద్రవిడ్ స్థానంలో కోచ్‌గా వచ్చిన గంభీర్ అనతికాలంలోనే అప్రదిష్టను మూటగట్టుకున్నాడు. జంబో కోచింగ్ బృందంతో భారత్‌ను నడిపిస్తున్న గంభీర్..బీసీసీఐకి ప్రతిబంధకంగా మారాడు. రోహిత్, కోహ్లీని సాగనంపి తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకుందామనుకున్న గంభీర్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో టీమ్ఇండియా తరఫున ఐదు సెంచరీలు నమోదైనా..ఓటమి వైపు నిలువడం అభిమానులను కలిచివేసింది. ఇంగ్లండ్‌పై దాదాపు అన్ని సెషన్లలో ఆధిపత్యం ప్రదర్శించినా లీడ్స్‌లో మనకు ఓటమి ఎదురుకావడం గంభీర్ కోచింగ్ శైలిపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. బ్యాటర్‌గా గిల్ తొలి మ్యాచ్‌లో సఫలమైనా జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో విఫలమయ్యాడు.
బ్యాటింగ్‌లో రాణిస్తున్నా..సెషన్ సెషన్‌కు మారే ఆటతీరుకు అనుగుణంగా ఎత్తుకు పైఎత్తులు వేయడంలో కెప్టెన్ గిల్ ఇంకా ఓనమాల దశలోనే ఉన్నాడు. సరిగ్గా మూడేండ్ల క్రితం ఇంగ్లండ్‌కు ఇంగ్లండ్‌లోనే ముచ్చెమటలు పట్టించిన కోహ్లీ లేని లోటు టీమ్ఇండియాలో స్పష్టంగా కనిపిస్తున్నది. లార్డ్స్ టెస్టులో తాను అనుకున్నట్లు 60 ఓవర్ల పాటు నరకం చూపించిన కోహ్లీ తెగువ..ఇప్పుడు భారత్‌కు కరువైంది. వికెట్ పడగానే బెబ్బులిలా గర్జిస్తూ ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టించే కోహ్లీ లేకపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గిల్ స్థానంలో కోహ్లీ ఉండి ఉంటే తొలి టెస్టులో భారత్‌దే విజయంటూ సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు. మరోవైపు బజ్‌బాల్‌తో టెస్టు ఆటతీరును మార్చేసిన ఇంగ్లండ్ అదే దూకుడుతో భారత పనిపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. మరి ఇవన్నీ తట్టుకుంటూ మిగిలిన నాలుగు టెస్టుల్లో గెలిస్తేనే గంభీర్ కోచింగ్‌కు సార్థకత. లేకపోతే ఇక నుంచి ప్రతీ టెస్టు పరీక్షే.