ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్ (Women’s World Cup) సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు (Team India) అదరగొట్టింది. గురువారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా.. 53 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) తేడాతో ప్రత్యర్థిని ఓడించి ఈ టోర్నీలో సెమీస్ చేరిన నాలుగో జట్టుగా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 49 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 340 రన్స్ చేసింది.
ఓపెనర్లు ప్రతీక రావల్ (134 బంతుల్లో 122, 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ స్మృతి మంధాన (95 బంతుల్లో 109, 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాలతో గర్జించగా జెమీమా రోడ్రిగ్స్ (55 బంతుల్లో 76*, 11 ఫోర్లు) వేగంగా ఆడింది. ఛేదనలో కివీస్.. 44 ఓవర్లలో 271/8 వద్దే ఆగిపోయింది. బ్రూక్ హాలిడే (84 బంతుల్లో 81, 9 ఫోర్లు, 1 సిక్స్), ఇసాబెల్లా గేజ్ (51 బంతుల్లో 65*, 10 ఫోర్లు) పోరాడినా ఆ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నీలో సెమీస్ చేరడం భారత్‌కు ఇది ఐదోసారి కావడం విశేషం. ఈ టోర్నీలో ఆదివారం భారత జట్టు ఇదే వేదికపై బంగ్లాదేశ్‌తో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
కివీస్ ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్‌కు వచ్చిన టీమ్ఇండియాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ప్రారంభంలో క్రీజులో నిలవాలనే పట్టుదలతో ఆడిన స్మృతి-ప్రతీక ద్వయం.. కుదురుకున్నాక కివీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. మైర్ ఐదో ఓవర్లో రెండు బౌండరీలతో ప్రతీక బౌండరీల బాదుడుకు శ్రీకారం చుట్టింది. అదే ఊపులో మంధాన.. రెండు ఫోర్లతో పాటు కార్సన్ ఓవర్లో లాంగాఫ్ మీదుగా సిక్సర్ కొట్టింది. కెర్ 16వ ఓవర్లో ఫుల్‌టాస్ బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదిన మంధాన.. ఈ ఏడాది అత్యధిక సిక్సర్లు (వన్డేల్లో) కొట్టిన ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. 49 బంతుల్లో అర్ధ శతకం పూర్తయ్యాక మంధాన మరింత జోరు పెంచింది. మరో ఎండ్‌లో కాస్త నెమ్మదించిన ప్రతీక.. 75 బంతుల్లో ఫిఫ్టీ సాధించింది. కెర్ 29వ ఓవర్లో 6,4తో 90లలోకి వచ్చిన స్మృతి.. కెర్ 31వ ఓవర్లో సింగిల్ తీసి శతకాన్ని నమోదుచేసింది.
వన్డేల్లో ఆమెకు ఇది 14వ సెంచరీ కాగా ఈ ఏడాది ఐదోవది కావడం విశేషం. సెంచరీ తర్వాత మంధానను బేట్స్ ఔట్ చేయడంతో 212 పరుగుల రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. ఆమె నిష్క్రమించినా బ్యాటింగ్‌లో ప్రమోషన్ పొందిన జెమీమాతో కలిసి ప్రతీక వేగంగా ఆడింది. మైర్ బౌలింగ్‌లో పాయింట్ దిశగా సింగిల్ తీసిన ఆమె.. వన్డే ప్రపంచకప్ కెరీర్లో తన తొలి శతకాన్ని సాధించింది. రోడ్రిగ్స్ సైతం వేగంగా ఆడటంతో స్కోరుబోర్డు మరింత వేగంగా కదలింది. 43వ ఓవర్లో కెర్.. ప్రతీకను ఔట్ చేసినా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (10) అండతో జెమీమా దూకుడుగా ఆడి 38 బంతుల్లోనే ఆమె అర్ధశతకం పూర్తి చేసుకుంది. రోడ్రిగ్స్ బాదుడుతో 40 ఓవర్లకు 254/1గా ఉన్న భారత్.. తర్వాతి 8 ఓవర్లలోనే 86 రన్స్ రాబట్టింది. భారత ఇన్నింగ్స్ మరో ఓవర్లో ముగుస్తుందనగా వర్షం అంతరాయం కల్గించడంతో కొద్దిసేపటి విరామం తర్వాత మొదలైన ఆటలో కివీస్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325గా నిర్దేశించారు.
భారీ ఛేదనలో కివీస్ లక్ష్యం దిశగా సాగినా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది. క్రాంతి తన తొలి ఓవర్లోనే బేట్స్ (1)ను ఔట్ చేసి న్యూజిలాండ్‌కు తొలి షాకిచ్చింది. రేణుకా వరుస ఓవర్లలో ప్లిమ్మర్, కెప్టెన్ డివైన్‌ను ఔట్ చేసింది. ఐదు బౌండరీలు, ఓ సిక్సర్‌తో వేగంగా ఆడిన ప్లిమ్మర్ (30)ను 9వ ఓవర్లో బౌల్డ్ చేసిన ఆమె.. తన తర్వాతి ఓవర్లో డివైన్ (6)నూ అలాగే వెనక్కి పంపింది.
ఈ క్రమంలో అమెలియా (45), హల్లీడే కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ రాణా 21వ ఓవర్లో అమెలియా ఇచ్చిన క్యాచ్‌ను స్మృతి అందుకుంది. గ్రీన్ (18) ను ప్రతీక ఔట్ చేసింది. హాలీడే హాఫ్ సెంచరీ పూర్తయ్యాక వేగంగా ఆడింది. ఇసాబెల్లతో తో కలిసి ఆరో వికెట్‌కు 64 బంతుల్లోనే 72 రన్స్ జోడించిన ఆమె.. చరణి 39వ ఓవర్లో రాణాకు క్యాచ్ ఇవ్వడంతో ఆమె ఇన్నింగ్స్ ముగిసింది. చివర్లో జట్టు సాధించాల్సిన రన్‌రేట్ 25 దాటడంతో కివీస్‌కు ఓటమి తప్పలేదు.
భారత్: 49 ఓవర్లలో 340/3 (ప్రతీక 122, స్మృతి 109, బేట్స్ 1/40, మైర్ 1/52); న్యూజిలాండ్: 44 ఓవర్లలో 271/8 (హాలీడే 81, గేజ్ 65, రేణుకా 2/25, క్రాంతి 2/48)