Women’s T20 World Cup | దుబాయ్: మహిళల టీ20 ప్రపంచకప్ నిర్వహణకు భారత్ విముఖత తెలపడంతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మిగతా ఆప్షన్లపై దృష్టి సారించింది. వరల్డ్ కప్‌ను నిర్వహించేందుకు ఎడారి దేశం యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదివరకే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌లో బంగ్లాదేశ్ వేదికగా ఈ టోర్నీ జరగాల్సి ఉన్నప్పటికీ ఆ దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచకప్‌ను తరలించాలని ఐసీసీ భావిస్తోంది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఈ టోర్నీని నిర్వహిస్తామని హామీ ఇస్తూ మరికొన్ని రోజులు గడువు కోరినప్పటికీ ఐసీసీ మాత్రం సంతృప్తి చెందడం లేదు. యూఏఈలో వాతావరణ పరిస్థితులూ ఈ టోర్నీ నిర్వహణకు అనుకూలంగా ఉండటంతో ఆ దేశం మెగా టోర్నీ నిర్వహణకు ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. దుబాయ్, అబుదాబిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియాలు, ఇదివరకే అక్కడ పురుషుల టీ20 ప్రపంచకప్ నిర్వహించిన అనుభవం ఉండటంతో ఐసీసీ కూడా యూఏఈ వైపునకే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 3 నుంచి 20 మధ్య మహిళల ప్రపంచకప్ జరగాల్సి ఉంది.