దుబాయ్: షెడ్యూల్ ప్రకారం మహిళల వన్డే ప్రపంచకప్ నిర్వహిస్తామని సీఈవో ఆండ్రియా నెల్సన్ ప్రకటించారు. కరోనా వ్యాప్తి నేపధ్యంలో షెడ్యూల్లో మార్పులు ఏమీ లేవని స్పష్టం చేశారు. మార్చి 4 నుంచి న్యూజిలాండ్ వేదికగా జరుగాల్సిన వన్డే ప్రపంచకప్ వాయిదాకు అవకాశం ఉందనే వార్తలపై శుక్రవారం ఆమె స్పందించారు. ‘2021లో జరుగాల్సిన ప్రపంచకప్ ఈ ఏడాదికి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారమే టోర్నీని నిర్వహిస్తాం. న్యూజిలాండ్‌లో నిర్వహణకు మేం ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిపై ఐసీసీతో కలిసి పని చేస్తున్నాం. మెగా టోర్నీ ప్రారంభానికి ఇంకా 35 రోజుల సమయమే ఉంది’ అని ఆండ్రియా తెలిపారు. మార్చి 4 నుంచి న్యూజిలాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.