ఇస్తాంబుల్: ప్రతిష్ఠాత్మక మహిళల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్ నిఖత్ జరీన్ అదిరిపోయే శుభారంభం చేసింది. బుధవారం జరిగిన 52 కిలోల తొలి బౌట్లో నిఖత్ 5-0 తేడాతో హెరెరా అల్వెరెజ్(మెక్సికో)పై అద్భుత విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన ఈ ఇందూరు బాక్సర్ ప్రత్యర్థిపై పదునైన పంచ్‌లతో విరుచుకుపడింది. ఇటీవలే స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసిన నిఖత్..మెక్సికో బాక్సర్‌పై పంచ్‌ల వర్షం కురిపించింది. తొలి రౌండ్ నుంచే దూకుడు కనబరుస్తూ కీలక పాయింట్లు కొల్లగొట్టింది. తన ఎత్తును అనుకూలంగా మలుచుకుంటూ బౌట్‌ను తన వశం చేసుకుంది. తదుపరి బౌట్లో మంగోలియాకు చెందిన లుట్సకనీతో తలపడుతుంది. మిగతా బౌట్లలో పర్వీన్(63కి) 5-0 తేడాతో మరియా బోవా(ఉక్రెయిన్)పై, మనీశ(57కి)..కాలా థాపా(నేపాల్)పై ఏకపక్ష విజయాలతో ముందంజ వేశారు. ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న ఈ మెగాటోర్నీలో 73 దేశాల నుంచి 310 మంది బాక్సర్లు బరిలో ఉన్నారు.