మహిళల టీ20 ప్రపంచకప్ పోరుకు రంగం సిద్ధమైంది. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వేదికగా 10 జట్లు మెగాటోర్నీలో తలపడబోతున్నాయి. గురువారం నుంచి మొదలయ్యే పొట్టి ప్రపంచకప్‌లో రసవత్తర పోరాటాలకు తెరలేవనుంది.అభిమానులను మునివేళ్లపై నిలబెడుతూ బౌండరీలు చిన్నబోయేలా అమ్మాయిలు అదరగొట్టేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నారు. క్షణకాలంలో ఫలితం మారే టీ20ల్లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచేందుకు పక్కా ప్రణాళికతో కదంతొక్కనున్నారు. ఆరుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా ‘ఏడో’సారి కన్నేస్తే..ఈసారైనా కప్ ముద్దాడాలన్న కసితో భారత్ కనిపిస్తున్నది. కరీబియన్ గడ్డపై చరిత్ర సృష్టించిన రోహిత్‌సేనను స్ఫూర్తిగా తీసుకుంటూ సత్తాచాటాలని టీమ్ఇండియా పట్టుదలతో ఉన్నది.
T20 World Cup | దుబాయ్: మూడు నెలల క్రితం యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా ముగిసిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ అభిమానులను మరోసారి అలరించేందుకు మరో టీ20 విందు సిద్ధమైంది. గురువారం (అక్టోబర్ 3) నుంచి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేదికగా మహిళల పొట్టి ప్రపంచకప్‌నకు తెరలేవనుంది. వాస్తవానికి ఈ టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సి ఉన్నా ఆగస్టులో అక్కడ నెలకొన్న రాజకీయ అనిశ్చితితో ఐసీసీ ఈ మెగా పోరును యూఏఈకి తరలించింది. 9వ ఎడిషన్‌గా జరుగబోయే తాజా టోర్నీలో ఏడోసారి టైటిల్ కైవసం చేసుకునేందుకు ఆస్ట్రేలియా భావిస్తుండగా కంగారుల ఆధిపత్యానికి గండి కొట్టేందుకు భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి జట్లు పూర్తిస్థాయి అస్త్రశస్ర్తాలతో సన్నద్ధమయ్యాయి. ఈ టోర్నీలో ఇంతవరకూ గ్రూప్ దశను దాటని పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతో పాటు అరంగేట్ర జట్టు స్కాట్లాండ్ సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. గురువారం జరిగే డబుల్ హెడర్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను స్కాట్లాండ్ ఢీకొననుండగా రెండో మ్యాచ్‌లో పాకిస్థాన్.. శ్రీలంకతో తలపడనుంది.
టోర్నీ ఫార్మాట్ ఇలా..
అక్టోబర్ 3 నుంచి 20 దాకా యూఏఈలోని దుబాయ్, షార్జా వేదికలుగా జరుగబోయే ఈ మెగా టోర్నీలో మొత్తం 23 మ్యాచ్‌లు ఉన్నాయి. గ్రూప్ దశలో 20 మ్యాచ్‌లు, రెండు సెమీస్‌లు, ఫైనల్ జరుగనుంది. పది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ దశలో భాగంగా ఒక్కో జట్టు గ్రూపులోని మరో జట్టుతో ఒక మ్యాచ్ (మొత్తం నాలుగు) ఆడనుంది. గ్రూప్ దశలో టాప్-2 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 17, 18న సెమీస్ మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా 20న దుబాయ్ వేదికగా ఫైనల్ జరుగుతుంది.
ఆసీస్ ఆధిపత్యాన్ని నిలువరించేనా?
తొమ్మిదో ఎడిషన్‌గా జరుగుతున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా ఏకంగా ఆరుసార్లూ టైటిల్ నెగ్గి ఒకసారి రన్నరప్‌గా నిలిచిందంటేనే ఆ జట్టు ఆధిపత్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న కంగారూలు ఈసారి అలిస్సా హీలి నేతృత్వంలో ఆడనున్నారు. దిగ్గజ సారథి మెగ్‌లానింగ్ సారథ్యంలో గత ఎడిషన్ (2022) ఫైనల్లో దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపైనే చిత్తుచేసిన ఆసీస్.. యూఏఈలోనూ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని పట్టుదలతో ఉంది. హీలితో పాటు ఆష్లే గార్డ్నర్, ఎల్లీస్ పెర్రీ, తహిలా మెక్‌గ్రాత్, బెత్ మూనీ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. అయితే ఈసారి ఆసీస్‌కు టైటిల్ నెగ్గడం అంత సులభమైతే కాదు. గత రెండేండ్ల కాలంలో భారత్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి జట్లు నిలకడగా రాణిస్తుండగా న్యూజిలాండ్ సైతం మెరుగైన ఆటతీరుతో కంగారూలకు కళ్లెం వేసేందుకు సిద్ధమైంది.
భారత్ ఈసారైనా?
సుమారు దశాబ్దకాలం తర్వాత భారత ఐసీసీ ట్రోఫీ కలను నెరవేర్చిన పురుషుల జట్టు ఇచ్చిన గెలుపు స్ఫూర్తితో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన టోర్నీకి సిద్ధమైంది. టీ20 వరల్డ్‌కప్ తొలి ఎడిషన్ (2009) నుంచి ఆడుతున్నా భారత్ ఇప్పటిదాకా టైటిల్ నెగ్గలేదు. 2020 ఎడిషన్ ఫైనల్లో ఆసీస్ చేతిలోనే ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత ఎడిషన్‌లోనూ సెమీస్‌లో కంగారూలే మన టైటిల్ వేటకు అడ్డుపడ్డారు. గెలుపు దిశగా సాగుతున్న ఆ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ రనౌట్‌తో భారత అభిమానుల గుండె పగిలింది. కానీ గత రెండేండ్లలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వల్ల భారత్ బాగా మెరుగైంది. హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, దీప్తి శర్మ వంటి సీనియర్లతో పాటు షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్ వంటి మెరికల్లాంటి ఆటగాళ్లు మన సొంతం. యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో దీప్తి, శ్రేయాంక, రాధా యాదవ్ కీలకం కానున్నారు. అయితే ఈ ఏడాది పొట్టి ఫార్మాట్లో భారత్ ఏడు మ్యాచ్‌లు మాత్రమే ఆడటం గమనార్హం. గ్రూప్-ఏలో ఉన్న భారత్.. ఈనెల 4న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టైటిల్ వేటను మొదలుపెట్టనుంది. అక్టోబర్ 6న దాయాది పాకిస్థాన్‌తో ఆడుతుంది. 2018 నుంచి జట్టును నడిపిస్తున్న హర్మన్‌ప్రీత్‌పై ఈసారి ఒత్తిడి అధికంగా ఉంది. కీలక మ్యాచ్‌లలో ఒత్తిడి నుంచి బయటపడగలిగితే టైటిల్‌ను సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
భారత్ షెడ్యూల్
గ్రూప్ – ఏ: భారత్,పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక
గ్రూప్- బీ: ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్