WPL | వడోదర: గత రెండు సీజన్లుగా అభిమానులను విశేషంగా అలరిస్తున్న అమ్మాయిల ధనాధన్ క్రికెట్ పండుగ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మళ్లీ వచ్చింది. మూడో ఎడిషన్‌గా జరుగబోతున్న ఈ టోర్నీ శుక్రవారం నుంచి వడోదర (గుజరాత్) వేదికగా మొదలుకాబోతుంది. ఐదు జట్లతో జరుగనున్న ఈ టోర్నీలో ముంబై, బెంగళూరుతో పాటు లక్నో, వడోదర కూడా ఈసారి మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15 వరకూ జరిగే ఈ మెగా టోర్నీలో స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. మొదటి మ్యాచ్‌లో ఆర్సీబీ.. గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది.
బలాబలాల పరంగా ఐదు జట్లు సమఉజ్జీలుగా ఉన్నప్పటికీ టైటిల్ ఫేవరెట్లలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ ముందువరుసలో ఉన్నాయి. మొదటి సీజన్లో విఫలమైనా రెండో ఎడిషన్‌లో మాత్రం మంధాన సేన సత్తా చాటి ఆ ఫ్రాంచైజీ చరిత్రలో అబ్బాయిలు కూడా సాధించలేని ఘనతను అందుకుంది. ఆ ఉత్సాహంతో వరుసగా రెండో టైటిల్‌ను ఒడిసిపట్టేందుకు ఆ జట్టు సమాయత్తమైంది. రెండో టైటిల్ కోసం ఆర్సీబీతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కన్నేయగా గత రెండు ఎడిషన్లలో ఫైనల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది. కొత్త కెప్టెన్ల సారథ్యంలో గుజరాత్ జెయింట్స్ (ఆష్లే గార్డ్నర్), యూపీ వారియర్స్ (దీప్తి శర్మ) ఏ మేరకు సత్తా చాటుతాయనేది ఆసక్తికరం.
అంతర్జాతీయ స్థాయిలో సూపర్ స్టార్లు, వర్ధమాన క్రికెటర్లతో కళకళలాడుతున్న ఈ లీగ్.. గత రెండు ఎడిషన్లలో అనుకున్నదాని కంటే ఎక్కువ విజయవంతమైన విషయం తెలిసిందే. ఔత్సాహిక క్రికెటర్ల రాకతో మూడో సీజన్లో అంతకుమించిన మెరుపులు నమోదవుతాయనడంలో అతిశయోక్తేమీలేదు. డబ్ల్యూపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చిన శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్, తనూజా కన్వర్, ఆశా శోభన వంటి క్రికెటర్లు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ సీజన్‌కు ముందు జరిగిన వేలంలో మంచి ధర దక్కించుకున్న కశ్వీ గౌతమ్, సిమ్రన్ షేక్, ప్రేమ్ రావత్, కమిలిని వంటి క్రికెటర్లకు ఇదొక సువర్ణావకాశం. ఈ ఏడాది భారత్‌లోనే మహిళల వన్డే ప్రపంచకప్ కూడా ఉన్న నేపథ్యంలో డబ్ల్యూపీఎల్‌లో మెరిస్తే ఔత్సాహిక భారత క్రికెటర్లు జాతీయ జట్టులో వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.
గత రెండు ఎడిషన్ల మాదిరిగానే టోర్నీలో ప్రతి జట్టు లీగ్ దశలో ఒక్కో జట్టుతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనుండగా 2, 3 స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఆ మ్యాచ్‌లో విజేత ఫైనల్ చేరుతుంది. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 11 దాకా లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా మార్చి 13న ఎలిమినేటర్, 15న ఫైనల్ జరుగుతుంది. ఈ సీజన్లో డబుల్ హెడర్స్ ఏమీ లేవు. అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి.
మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటల నుంచి మొదలవుతాయి. స్టార్ స్పోర్ట్స్ (టీవీ), డిస్నీ హాట్‌స్టార్ (యాప్)లో ప్రత్యక్ష ప్రసారాలు.