Women’s IPL | వుమెన్స్ ఐపీఎల్ తొలి ఎడిన్స్కు సంబంధించిన వేలం త్వరలో జరుగనున్నది. ఈ నెల 11న లేదంటే 13న నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వేలానికి సంబంధించి వేదికను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. దేశ రాజధాని ఢిల్లీ లేదంటే ముంబయిలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ వారం బీసీసీఐ వేదిక, వేలం నిర్వహణపై నిర్ణయాన్ని ప్రకటించనున్నది. మహిళల ప్రీమియర్ లీగ్ వేలాన్ని 6న నిర్వహించాలని భావించినా.. తర్వాత నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నది.
వేలానికి సిద్ధమయ్యేందుకు బీసీసీఐ ఐపీఎల్‌లోని ఐదు ఫ్రాంచైజీలకు నెల రోజుల సమయం ఇచ్చింది. వుమెన్స్ ఐపీఎల్ మార్చి 4న ప్రారంభమై మార్చి 24 వరకు కొనసాగే అవకాశాలున్నాయి. టీ20 ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఫిబ్రవరి 10 నుంచి వుమెన్స్ టీ20 ప్రపంచకప్ మొదలు కానుండగా.. ఫిబ్రవరి 26న ఫైనల్ మ్యాచ్ జరుగనున్నది. ఇక ఐపీఎల్ తొలి సీజన్లో ఐపీఎల్లో 22 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఆయా మ్యాచ్‌లను బ్రబౌర్న్ స్టేడియం, డీవై పాటిల్ అకాడమీలో నిర్వహించే అవకాశాలున్నాయి.