Hockey5s Women’s World Cup : మహిళల హాకీ ఫైవ్స్ ప్రపంచకప్‌లో భారత జట్టు ఆఖరి మెట్టుపై తడబడింది. ఆదివారం మస్కట్‌లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్(Netherlands) చేతిలో చిత్తుగా ఓడి రన్నరప్‌గా నిలిచింది. జ్యోతి ఛత్రి, రుతుజా దదొసా మాత్రమే రాణించడంతో 2 -7తో ఘోరంగా పరాజయం పాలైంది.
శనివారం జరిగిన సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా టైటిల్ పోరులో విఫలమైంది. జ్యోతి, రుతుజా మినహా ఏ ఒక్కరూ ఆకట్టుకోలేకపోయారు. ఆట మొదలైన రెండో నిమిషంలోనే తొలి గోల్‌తో నెదర్లాండ్స్ జట్టు భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది.
జన్నెకె వాన్ డి వెన్నే(2వ, 14వ నిమిషంలో), లానా కస్లే (11వ, 27 వ నిమిషం) రెండేసి గోల్స్‌తో సత్తా చాటారు. బెంటే వాన్ డెర్ వెల్డ్ట్ 13వ నిమిషంలో, సోషా బెన్నింగా 13 నమిషంలో గోల్ సాధించారు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన టీమిండియా సభ్యులకు ప్రోత్సాహకంగా హాకీ ఇండియా(Hockey India) నగదు బహుమతి ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ. 3లక్షల ప్రైజ్‌మనీ ప్రకటించింది. సహాయక సిబ్బందికి తలా లక్షనర ఇవ్వనున్నట్టు తెలిపింది.