Asia Cup | రాజ్‌గిర్ (బీహార్): ఈ ఏడాది అత్యంత పేలవ ప్రదర్శనతో సాగుతున్న భారత మహిళల హాకీ జట్టు స్వదేశంలో మరో కఠిన సవాలుకు సిద్ధమైంది. నేటి నుంచి బీహార్‌లో జరుగనున్న మహిళల ఆసియా కప్ (ఆసియన్ చాంపియన్స్ ట్రోఫీ (ఏసీటీ))నకు తెర లేవనుంది. గత ఎడిషన్ రాంచీలో టైటిల్ నెగ్గిన భారత్.. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. అయితే ఈ ఏడాది ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో ఆడిన 16 మ్యాచ్‌లలో భారత్ ఏకంగా 13 మ్యాచ్‌లలో ఓడింది.
అంతేగాక పారిస్ ఒలింపిక్స్‌కూ అర్హత సాధించలేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌లో అయినా పుంజుకుని మళ్లీ గెలుపు బాట పట్టాలని భారత్ భావిస్తోంది. కెప్టెన్ సలీమా నేతృత్వంలోని యువ ఆటగాళ్లు, సీనియర్లతో జట్టు సమతూకంగా ఉంది. చైనా, జపాన్, కొరియా, థాయ్‌లాండ్ వంటి జట్లు పాల్గొననున్న ఈ టోర్నీలో భారత్.. సోమవారం మలేషియాతో జరుగబోయే మ్యాచ్‌తో టైటిల్ వేటను మొదలుపెట్టనుంది.