గురువారం 02 జూలై 2020
Sports - Apr 17, 2020 , 17:02:33

గృహహింసపై సానియా మీర్జా ఆగ్రహం

గృహహింసపై సానియా మీర్జా ఆగ్రహం

న్యూఢిల్లీ: లాక్​డౌన్ సమయంలో గృహ హింస కేసులు పెరగడంపై భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆగ్రహం వ్యక్తం చేసింది. లాక్​డౌన్​పై ఓ చానెల్ శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ-కాన్​క్లేవ్​లో సానియా మాట్లాడింది. మహిళలు ధైర్యంగా ఉండి, పరుషులతో సమానంగా గౌరవం కోసం డిమాండ్ చేయాలని సానియా సూచించింది. లాక్​డౌన్ కాలంలో గృహ హింస కేసులు పెరిగినట్టు ఇటీవల నివేదికలు వెల్లడైన విషయం తెలిసిందే.

“మనమందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. పురుషులు, మహిళలను సమానం గౌరవంతో చూడాలి. గృహహింస కేసులు పెరిగాయన్న నివేదికలను చూశా. ఇవి అమానుష చర్యలు. గృహహింసను నేను ఎప్పుడూ తీవ్రంగా ఖండిస్తా. మహిళలను తమతో సమానంగా పురుషులు గౌరవించాలి. మర్యాదగా ప్రవర్తించాలి. గౌరవం కోసం డిమాండ్ చేయాల్సిన బాధ్యత మహిళలపై ఉంది’ అని సానియా మీర్జా చెప్పింది.

తాము రూ.2.5కోట్ల నిధులను సమీకరించి లక్షల మందికి ఆహారం అందించామని, ఇంకా ఎక్కువ మందికి నేరుగా సాయం చేయాలని అనుకుంటున్నానని సానియా మీర్జా తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసినా, సరిపోదని చెప్పింది. కాగా,  లాక్​డౌన్ నేపథ్యంలో ఒక్కపూట కూడా ఆహారం దొరక్క ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో వంటకాల ఫొటోలను ఎవరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని సానియా మీర్జా ఇటీవలే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.


logo