టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా కీలక పోరుకు సిద్ధమైంది. మెగాటోర్నీలో టైటిల్ దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్న భారత్..బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దక్షిణాఫ్రికాతో గత మ్యాచ్‌లో ఓటమి నుంచి తేరుకుని బంగ్లా భరతం పట్టాలని చూస్తున్నది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలువడం ద్వారా సెమీస్ బెర్తు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.
మరోవైపు పడుతూలేస్తూ ముందుకు సాగుతున్న బంగ్లాదేశ్..టీమ్ఇండియాకు పోటీనిచ్చేందుకు తహతహలాడుతున్నది. తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా కంగుతినిపించే సత్తా ఉన్న బంగ్లా టైగర్స్ ఆటలు భారత్ ముందు నడుస్తాయో లేవో చూడాలి. భారత్, బంగ్లా పోరుకు వరుణుడు ఆటంకం కల్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అడిలైడ్: భారత్, బంగ్లాదేశ్ ప్రతిష్ఠాత్మక పోరుకు సిద్ధమయ్యాయి. దాదాపు మూడేండ్ల తర్వాత పొట్టి పోరులో ముఖాముఖి తలపడుతున్న ఈ ఉపఖండ జట్ల మధ్య పోరు అభిమానులను అలరించనుంది. 15 ఏండ్ల తర్వాత ప్రపంచకప్‌ను ముద్దాడాలన్న పట్టుదలతో భారత్ కనిపిస్తుంటే.. పోటీలో నిలువాలని బంగ్లా తహతహలాడుతున్నది. టీమ్ఇండియా లాగా కప్ గెలువడం తమ లక్ష్యం కాదన్న బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ దీటైన పోటీకి సై అంటున్నాడు. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై వరుస విజయాలతో జోరు మీద కనిపించిన రోహిత్‌సేనకు..దక్షిణాఫ్రికా బ్రేక్‌లు వేసింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఫామ్ టీమ్ఇండియాను కలవరపెడుతున్నది. స్వల్పస్కోర్లకే పరిమితమవుతూ వస్తున్న రాహుల్‌కు మేనేజ్మెంట్ అండగా నిలుస్తున్నది. సఫారీలతో మ్యాచ్‌లో వెన్నునొప్పితో మధ్యలో నిష్క్రమించిన దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే భారత బ్యాటింగ్ బలం మరింత పెరగనుంది. బౌలింగ్ విషయానికొస్తే భువనేశ్వర్, అర్ష్‌దీప్‌సింగ్, షమీతో కూడిన పేస్ త్రయం అంచనాలకు తగ్గట్లు రాణిస్తున్నది. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ ప్రత్యర్థి బ్యాటర్లపై పైచేయి సాధిస్తున్నది. సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌ను కొనసాగిస్తారా లేక చాహల్‌కు చాన్స్ ఇస్తారన్నది చూడాలి.
తస్కిన్ సూపర్‌ఫామ్
మెగాటోర్నీలో బంగ్లా పేసర్ తస్కిన్ అహ్మద్ సూపర్‌ఫామ్ మీద ఉన్నాడు. తనదైన స్వింగ్‌తో బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ఆదిలోనే ప్రత్యర్థిని దెబ్బకొడుతూ జట్టుకు మెరుగైన శుభారంభాలు అందిస్తున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లతో జోరు కొనసాగిస్తున్నాడు. బుధవారం భారత్‌తో మ్యాచ్‌లోనూ సత్తాచాటేందుకు తస్కిన్ కసితో ఉన్నాడు. ఈ యువ బౌలర్‌కు ముస్తాఫిజుర్ జతకలిస్తే బంగ్లాకు తిరుగుండకపోవచ్చు. కెప్టెన్ షకీబల్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్, అఫిఫ్ హుస్సేన్‌పై బంగ్లా బ్యాటింగ్ భారం ఉంది.