Champions Trophy | వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరుగాల్సి ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్‌ను ప్రకటించలేదు. ఈ సారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ ఆతిథ్యం ఇవ్వనున్నది. ఈ క్రమంలో దాయాది దేశానికి వెళ్లేందుకు భారత్ నిరాకరిస్తున్నది. హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు పాక్ ససేమిరా అంటున్నది. ఈ క్రమంలో ప్రతిష్టంభన నెలకొన్నది. ఈ క్రమంలోనే ఐసీసీ ఓ సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నెల 29న శుక్రవారం ఈ భేటీ జరుగనున్నది. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌పై చర్చించనున్నట్లు సమాచారం. ఐసీసీ చైర్మన్‌గా జైషా బాధ్యతలు స్వీకరించే ముందే ఈ సమావేశం జరుగబోతున్నది.
ఈ సమావేశానికి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు హాజరవుతాయని.. షెడ్యూల్‌పై చర్చించనున్నట్లు ఐసీసీ అధికార ప్రతినిధి మంగళవారం తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతుందన్నారు. డిసెంబర్ ఒకటిన జైషా ఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి పాక్ అతిథ్యం ఇవ్వనుండగా.. భారత జట్టును పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. ఈ విషయాన్ని ఐసీసీతో పాటు పీసీబీకి సైతం స్పష్టం చేసింది. అయితే, హైబ్రిడ్ మోడల్లో టోర్నీని ప్రతిపాదనను పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ తిరస్కరించారు. సమావేశంలో చర్చించి టోర్నీపై నిర్ణయం తీసుకోనున్నారు. పాక్ హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరిస్తే.. టీమిండియా ఆడే మ్యాచులన్నీ యూఏఈలో జరిగే అవకాశం ఉంటుందని పలు నివేదికలు పేర్కొన్నాయి. 29న జరిగే సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.