కరాచీ: టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్నదానిపై అనిశ్చితి కొనసా..గుతూనే ఉంది. ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లబోయే (మ్యాచ్ రైద్దెతే) ఆస్కారమున్న నేపథ్యంలో ఐసీసీ ఈ మ్యాచ్‌ను ఎలాగైన నిర్వహించాలని చూస్తున్నా.. పాకిస్థాన్ మాత్రం తాము ఆడతాం కానీ తమ డిమాండ్లను నెరవేరిస్తేనే మ్యాచ్‌పై పునరాలోచిస్తామని ఐసీసీ ప్రతినిధికి వివరించినట్టు సమాచారం. కరాచీలో జరిగిన చర్చల్లో పాక్ బోర్డు.. ఐసీసీ ఎదుట పలు డిమాండ్లను ఉంచినట్టు తెలుస్తున్నది.
అందులో ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో క్రికెట్ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు ఇవ్వడం, ప్రపంచకప్ ఆడనప్పటికీ ఆ దేశానికి పార్టిసిపేషన్ ఫీజు మంజూరు చేయడం, ఐసీసీ ఫ్యూచర్ టూర్స్‌లో బంగ్లాకు ఆతిథ్య హక్కులు అందించడం, భారత్-పాక్-బంగ్లాదేశ్‌తో ముక్కోణపు సిరీస్, భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ వంటివి ప్రతిపాదించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
వీటిలో చాలావరకూ ఐసీసీ పరిధిలోనివి కాకుండా భారత ప్రభుత్వం, బీసీసీఐ చేతిలో ఉన్నవే కావున ఆ విషయంలో ఐసీసీ నిస్సహాయంగానే ఉండే అవకాశాలున్నాయి. ఇదిలాఉండగా రాబోయే 48 గంటల్లో భారత్, పాక్ మ్యాచ్ భవితవ్యం తేలనుందని పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ వ్యాఖ్యానించడం గమనార్హం. ఐసీసీ, పీసీబీతో చర్చల్లో పాల్గొన్న బంగ్లా క్రికెట్ బోర్డు చీఫ్ అమినుల్ ఇస్లాం సైతం.. పాక్, భారత్‌తో మ్యాచ్ ఆడాలని సూచించడం విశేషం.