Hardik Pandya | ఇటీవలే బంగ్లాదేశ్‌తో ముగిసిన మ్యాచ్‌లో గాయపడి న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తదుపరి పోరులో అందుబాటులో ఉంటాడా..? వచ్చే ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే మ్యాచ్‌లో హార్ధిక్ ఆడతాడా..? అంటే సమాధానం అవుననే వినిపిస్తున్నది. హార్ధిక్‌కు అయిన గాయం పెద్దదేమీ కాదని.. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ)లో ఉన్న హార్ధిక్, వచ్చే ఆదివారం సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత నేరుగా పూణె నుంచి బెంగళూరుకు వెళ్లిన పాండ్యా అక్కడ యూకేకు చెందిన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడి గాయాన్ని పరిశీలించిన వైద్యులు స్కాన్ రిజల్ట్స్‌ను విశ్లేషించిన తర్వాత హార్ధిక్‌కు అయిన గాయం కేవలం బెణుకు మాత్రమే అని దానివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్‌కు విశ్రాంతి దొరకడంతో హార్ధిక్ కూడా ఎన్సీఎలోనే గడుపుతున్నాడు. త్వరలోనే అతడు భారత జట్టుతో కలవనున్నాడు.
కాగా కివీస్‌తో పోరులో హార్ధిక్ లేకపోవడంతో టీమిండియా అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించింది. అయితే సూర్య మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. మరోవైపు శార్దూల్ ఠాకూర్ స్థానంలో వచ్చిన మహ్మద్ షమీ.. ఐదు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఒకవేళ హార్ధిక్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో తిరిగివస్తే సూర్యకుమార్ యాదవ్ మళ్లీ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. అంతేగాక అతడు వస్తే భారత్‌కు మరో బౌలింగ్ ఆప్షన్ కూడా పెరుగుతుంది. మిడిలార్డర్లో కీలకమైన హార్ధిక్.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కల్లా పూర్తిస్థాయిలో కోలుకోవాలని టీమిండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.