Ben Stokes | లండన్: ఇంగ్లండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ వన్డేలలోనూ ఆ బాధ్యతలు మోయనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే ఇంటిబాట పట్టిన తర్వాత ఆ జట్టు నాయకుడు జోస్ బట్లర్.. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలో కొత్త నాయకుడి వేటలో పడ్డ ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ).. టెస్టులలో ఆ జట్టును విజయవంతంగా నడిపిస్తున్న స్టోక్స్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. కాలిగాయంతో ఆటకు దూరమైన స్టోక్స్ ప్రస్తుతం అబుదాబిలో రికవరీ అవుతున్నాడు. మరి ఇదివరకే వన్డేలకు ఓసారి రిటైర్మెంట్ ప్రకటించి వన్డే వరల్డ్ కప్ సందర్భంగా మళ్లీ జట్టులోకి వచ్చిన అతడు.. ఈసీబీ కోరిక మేరకు నాయకత్వ పగ్గాలు చేపడతాడా? లేదా? అన్నది త్వరలో తేలనుంది.