వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత జట్టు మిడిలార్డర్ తడబడింది. టాపార్డర్ బ్యాటర్లు శిఖర్ ధావన్ (97), శుభ్‌మన్ గిల్ (65), శ్రేయాస్ అయ్యర్ (54) రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో ఎక్కువసేపు నిలబలేకపోయాడు. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్ల నష్టానికి 308 స్కోరు మాత్రమే చెయ్యగలిగింది.
టాపార్డర్ బ్యాటర్లు వెనుతిరిగిన తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (14), సంజూ శాంసన్ (12) తీవ్రంగా నిరాశపరిచారు. ఈ క్రమంలో దీపక్ హుడా (27), అక్షర్ పటేల్ (21) కాసేపు నిలబడినా చివర్లో అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో ఇద్దరూ బౌల్డ్ అయ్యి మైదానం వీడారు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, గుడకేష్ మోటీ ఇద్దరూ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. రొమేరియో షెఫర్డ్, అకీల్ హొస్సేనో చెరో వికెట్ తీసుకున్నారు.