Test Captain | రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్‌తో జరుగనున్న టెస్ట్ సిరీస్‌కు ముందే రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌తో 2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ని భారత జట్టు కొత్తగా ప్రారంభించనున్నది. రోహిత్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్‌గా ఎవరికి చాన్స్ వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు ప్లేయర్లు పోటీలో ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు నుంచి రోహిత్ టెస్టుల్లో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆరు, ఏడోస్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తున్నాడు. అయితే, ఇప్పుడు జట్టులో రోహిత్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనే చర్చ సాగుతుంది.
శుభ్‌మన్ గిల్‌కే కెప్టెన్సీ చాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐతో పాటు సెలెక్టర్లు గిల్ వైపే ఆసక్తి చూపిస్తున్నట్లుగా పలు మీడియా నివేదికలు తెలిపాయి. ఇప్పటికే వన్డేల్లో శుభ్‌మన్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యత ఇచ్చిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేని సమయాల్లో శుభ్‌మన్ గిల్ టీ20 కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ క్రమంలో మొదటి అవకాశం గిల్‌కు దక్కే అవకాశం ఉందని అంచనా. రాబోయే ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ సైకిల్ని దృష్టిలో పెట్టుకొని జట్టును తీర్చిదిద్దాలని హెడ్‌కోచ్ గంభీర్ కృతనిశ్చయంతో ఉన్నాడు. ఈ క్రమంలో యువ ప్లేయర్‌నే కెప్టెన్‌గా తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. కెప్టెన్ అయితే, మూడోస్థానంలో బ్యాటింగ్ చేయడం ఖాయమని పేర్కొన్నారు. మూడోస్థానంలో శుభ్‌మన్ గిల్‌కు అన్ని ఫార్మాట్లలో మంచి రికార్డు ఉంది. గిల్ 32 మ్యాచ్‌ల్లో 35.05 సగటుతో 1,893 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గిల్‌ను కెప్టెన్‌గా నియమించడానికి రెండవ కారణం ఫిట్నెస్. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ఆటగాళ్లలో ఫిట్‌గా ఉన్న ప్లేయర్లలో ఒకడు. టీమిండియా ఆడిన అన్ని మ్యాచులకు అందుబాటులో ఉన్నాడు.
భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీ రేసులో ఉన్న మరో ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా. ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తొలి మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ఫిట్‌గా ఉండి బౌలింగ్ చేసి ఉంటే.. టీమిండియా ఆ టెస్ట్ గెలిచి సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉండేది. బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లో ఒకడు. ఆస్ట్రేలియా పర్యటనలో బుమ్రా తన కెప్టెన్సీ ప్రశంసలు అందుకున్నాడు. సునీల్ గవాస్కర్‌తో సహా చాలా మంది దిగ్గజాలు బుమ్రాను రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్‌గా చేయాలని డిమాండ్ చేశారు. బుమ్రా తరుచూ గాయాల బారినపడడం ప్రతికూలంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కారణంగా దాదాపు నాలుగు నెలలు క్రికెట్‌కు దూరం కావాల్సి వచ్చింది. వెన్నునొప్పి సమస్యతో ఇబ్బందిపడ్డ విషయం తెలిసిందే. కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తే ప్రతీ మ్యాచ్‌కు అందుబాటులో ఉండాల్సిందే. ఈ క్రమంలో బీసీసీఐ, సెలెక్టర్లు ఈ రిస్క్ తీసుకునేందుకు ఆసక్తి చూపించకపోవచ్చు. మాజీలు సైతం కీలక మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేలా చూడాలని.. పనిభారం పడకుండా చూడాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో బుమ్రా కంటే గిల్ వైపే బీసీసీఐ ఆసక్తి చూపే అవకాశం ఉంది.
టెస్టుల్లో రోహిత్ ప్లేస్‌లో ఎవరితో భర్తీ చేయనున్నారనే చర్చ సాగుతుంది. ప్రస్తుతం డొమెస్టిక్ క్రికెట్లో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఇందులో శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల యువ ఆటగాడు సాయి సుదర్శన్ సైతం ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి చాన్స్ దక్కనున్నది. సాయి సుదర్శన్ ఐపీఎల్లో తన బ్యాటింగ్‌తో అందరి ప్రశంసలు అందుకున్నాడు. దిగ్గజ ప్లేయర్స్ సైతం అభినందించారు. ఈ క్రమంలో భారత్ తరఫున టెస్టులు ఆడే అవకాశాలున్నాయి. సుదర్శన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 29 మ్యాచుల్లో 39.93 సగటుతో 1957 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా దింపే అవకాశం ఉంది. టీమ్ మేనేజ్మెంట్ రోహిత్ స్థానంలో రాహుల్ మిడిల్ ఆర్డర్లో పంపి.. సుదర్శన్, యశస్వి జైస్వాల్‌ని ఓపెనర్‌గా పంపొచ్చు. ప్రస్తుత ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున సాయి సుదర్శన్ భారీగానే పరుగులు చేశాడు. ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. శ్రేయాస్ దేశీయ క్రికెట్లో చాలా పరుగులు చేశాడు. యశస్వి, రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తే శ్రేయాస్‌కు మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు పంపేందుకు అవకాశం ఉంది.