Ishan Kishan: టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్, రెండు నెలలుగా వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరంగా ఉంటున్న ఇషాన్ కిషన్ తిరిగి భారత జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనంటున్నాడు హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్. గతేడాది వెస్టిండీస్ టూర్ సందర్భంగా ఎంట్రీ ఇచ్చిన ఇషాన్.. ఈ ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా ‘వ్యక్తిగత కారణాలు’ అని చెప్పి వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు వచ్చాడు. డిసెంబర్లో ముగిసిన టీ20 సిరీస్‌లో కిషన్‌కు చోటు దక్కినా టీమ్ మేనేజ్మెంట్ మాత్రం అతడిని ఆడించలేదు. స్వదేశంలో భారత జట్టు ఆస్ట్రేలియాతో ఆడిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ తర్వాత ఇషాన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దక్షిణాఫ్రికా నుంచి ఉన్నఫళంగా వచ్చిన అతడు ఇండియాకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు..? అనేది కూడా క్లారిటీ లేదు.
ఇంగ్లండ్‌తో ముగిసిన రెండు టెస్టుల కోసం సెలక్టర్లు గతంలోనే ప్రకటించిన జట్టులో ఇషాన్ లేడు. ఆ సమయంలో ఇషాన్ జట్టులోకి తిరిగి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని ద్రావిడ్ సూచించిన విషయం తెలిసిందే. బీసీసీఐ, సెలక్టర్లు కూడా అతడికి ఇదే విషయాన్ని చెప్పినట్టు వార్తలు వినిపించాయి. జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు గాను ప్రస్తుతం దేశవాళీలో జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఆడాలని ఇషాన్‌కు సూచించినా అతడు మాత్రం పట్టించుకోవడం లేదు. జార్ఖండ్ తరఫున ఆడే ఇషాన్.. రంజీ టీమ్ మేట్స్‌కు కూడా అందుబాటులో ఉండటం లేదు.
రెండో టెస్టు ముగిసిన తర్వాత ఇషాన్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ద్రావిడ్ సమాధానం చెబుతూ… ‘ఇషాన్ తనకు బ్రేక్ కావాలని రిక్వెస్ట్ చేశాడు. టీమ్ మేనేజ్మెంట్ అతడికి బ్రేక్ ఇచ్చింది. అతడు జాతీయ జట్టులోకి తిరిగి రావాలంటే మాత్రం ఇషాన్ కచ్చితంగా కొంత క్రికెట్ ఆడాల్సిందే. మేం అతడు ఏదో చేయాలని కోరుకోవడం లేదు. ఇషాన్ మాతో టచ్‌లోనే ఉన్నాడు. కానీ ఇప్పటికీ అతడు బ్రేక్ తర్వాత ఏ రకమైన క్రికెట్ ఆడలేదు..’ అని అన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు టెస్టులకు సెలక్టర్లు రేపో మాపో జట్టును ఎంపిక చేయనున్న నేపథ్యంలో ఇషాన్ ఎంపికవడం ఇప్పటికైతే అనుమానమే. ఇషాన్ గైర్హాజరీలో భారత్.. కోన శ్రీకర్ భరత్‌తో నెట్టుకొస్తున్నది. కీపింగ్ విషయంలో భరత్‌లో లోపాలేమీ లేకున్నా బ్యాటింగ్‌లో మాత్రం అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. హైదరాబాద్‌తో పాటు వైజాగ్‌లో అతడి వైఫల్యాలు కొనసాగాయి. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి అతడు చేసిన పరుగులు 92 మాత్రమే. సొంతగడ్డ వైజాగ్‌పై జరిగిన టెస్టులో కూడా భరత్.. 17, 6 పరుగులు చేసి విఫలమయ్యాడు.