Team India | సిడ్నీ: టెస్టులలో వరుస ఓటములు.. సొంతగడ్డపై అవమానకర రీతిలో సిరీస్ (కివీస్ చేతిలో) క్లీన్‌స్వీప్.. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్తు గల్లంతు! సీనియర్ల వైఫల్యం.. తదితర పరిణామాల అనంతరం మరో వార్త భారత క్రికెట్ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ టెస్టు ఓటమి తర్వాత టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్‌లో విభేదాలు పొడచూపాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పలువురు సీనియర్ ఆటగాళ్ల బాధ్యతరాహిత్యమైన ఆటతీరుపై ప్రధాన కోచ్ గౌతం గంభీర్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడని.. బాక్సింగ్ డే టెస్టు ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లతో ‘ఇక చేసింది చాలు’ (బహుత్ హోగయా!) అని మండిపడ్డట్టు సమాచారం. అంతేగాక గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ మధ్య కూడా సఖ్యత లోపించిందని.. వీరందరూ ముఖా లు చూసుకోవడానికీ ఇష్టపడనంతగా నొచ్చుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
గతేడాది జూలై 9న హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్.. ఆటగాళ్లతో ‘సింక్’ అవడం కోసం వారి సహజ ఆటతీరుకు భంగం కలిగించకుండా ఉండేందుకు వారికి ఆరు నెలల పాటు సమయమిచ్చాడని, కానీ పలువురు సీనియర్లు పరిస్థితులకు తగ్గట్టుగా కాకుండా తమకు నచ్చినట్టు ఆడి వికెట్‌ను పారేసుకోవడం అతడికి ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చిన రోహిత్.. ఈ సిరీస్‌లో ఇప్పటి దాకా రెండంకెల స్కోరు చేయలేదు. పదే పదే పుల్‌షాట్లు ఆడబోయి ఔట్ అవుతున్న అతడు.. బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో తన సహజ ఆటతీరును పక్కనబెట్టి మరీ ఆడినా మళ్లీ తన బలహీనతను బయటపెట్టుకున్నాడు. ఇక కోహ్లీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆఫ్‌స్టంప్ అవతల బంతులను వెంటాడుతూ బలవుతున్నాడు. పెర్త్ టెస్టులో సెంచరీ మినహా ఈ సిరీస్‌లో అతడి ప్రదర్శన దారుణం. రిషభ్ పంత్.. బాధ్యతారాహిత్యమైన షాట్లు ఆడి ఔట్ అవుతున్నాడు. నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్ సెకండ్ సెషన్లో యశస్వీతో బాగానే పోరాడినా మూడో సెషన్లో అనవసర షాట్ ఆడటంతో ఆ తర్వాత 34 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి భారత్ ఆలౌట్ అయింది. యశస్వీ, రాహుల్, నితీశ్, వాషింగ్టన్ వంటి ఆటగాళ్లు మినహా మిగిలిన బ్యాటర్ల ప్రదర్శన అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో గంభీర్ సీనియర్ ఆటగాళ్ల ఆటతీరుపై గుర్రుగా ఉన్నాడని.. ఇక నుంచి జట్టు వ్యూహాలు, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడని ఆటగాళ్లపై వేటు తప్పదని చెప్పకనే చెప్పినట్టు వినికిడి.
జట్టు కూర్పు విషయంలోనూ కోచ్, కెప్టెన్, సెలక్షన్ కమిటీ మధ్య మనస్పర్థలు వచ్చినట్టు తెలుస్తోంది. పెర్త్ టెస్టులో గెలిచిన తర్వాత తనకు ఛతేశ్వర్ పుజారా కావాలని, అతడు జట్టులో స్థిరత్వం తీసుకురాగలడని గంభీర్ కోరగా దానికి సెలక్షన్ కమిటీ తిరస్కరించినట్టు తెలుస్తోంది. కొత్త ఆటగాళ్ల వేటలో భాగంగా టీమ్ఇండియా.. పుజారా, రహానే వంటి సీనియర్లను ఏడాది క్రితమే పక్కనబెట్టేసిన విషయం తెలిసిందే. పెర్త్ టెస్టులో హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్‌ను ఆడించడం.. పింక్ బాల్ టెస్టుకు ఆకాశ్‌దీప్‌ను తీసుకోకపోవడం వంటి విషయాల్లో గంభీర్‌తో సెలక్షన్ కమిటీ విభేదించినట్టు వార్తలు వస్తున్నాయి.
ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలో ఉండగా ఎవరూ ఊహించని విధంగా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అశ్విన్ రిటైర్మెంట్లో గంభీర్ పాత్ర ఏంటని కూడా బీసీసీఐ ఆరా తీస్తోంది. మరోవైపు జట్టులో విభేదాలతో కలత చెందిన అశ్విన్.. వీడ్కోలు పలికినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
జట్టు సెలెక్షన్ విషయంలోనూ రోహిత్, గంభీర్ మధ్య ఏకాభిప్రాయం లేదని సమాచారం. గతంలో ఎవరైనా ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోకుంటే రోహిత్.. సదరు ప్లేయర్ దగ్గరకు వెళ్లి అతడిని ఎందుకు తీసుకోలేదో చెప్పేవాడు. కానీ ఇప్పుడు మాత్రం అలా చేయడం లేదట! మాజీ కోచ్ ద్రవిడ్‌తో ఉన్న సఖ్యత.. గంభీర్‌తో లేదని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లతో పాటు గంభీర్ ప్రదర్శనపైనా బీసీసీఐ దృష్టి సారించినట్టు బోర్డు వర్గాల సమాచారం. ఇదే విషయమై బోర్డు ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఈ సిరీస్‌లో మరో టెస్టు మిగిలుంది. ఫిబ్రవరి-మార్చిలో చాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఒకవేళ అప్పటి వరకు జట్టు ప్రదర్శన పురోగతి సాధించకుంటే గంభీర్ స్థానం కూడా సురక్షితం కాదు’ అని తెలిపాడు. గంభీర్ సపోర్ట్ స్టాఫ్‌లో భాగమైన బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ ప్రదర్శనపైనా బీసీసీఐ అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత రోహిత్, గంభీర్‌తో చర్చించనున్న బీసీసీఐ.. ఈ వివాదాలకు ముగింపు పలకాలని భావిస్తున్నా ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని టీమ్ఇండియా అభిమానులు వాపోతున్నారు.