WFI : ప్రతిష్ఠాత్మక ప్యారిస్ ఒలింపిక్స్(Paris Olympics 2024) లో పతకం కొల్లగొట్టాలనుకున్న భారత స్టార్ రెజ్లర్ రవి దహియా (Ravi Dahiya) కల చెదిరింది. మంగళవారం భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI ) అతడికి భారీ షాకిచ్చింది. ఫైనల్ ట్రయల్స్ (Final Trails) లేకుండానే ప్యారిస్ ఒలింపిక్స్‌కు బృందాన్ని పంపేందుకు డబ్ల్యూఎఫ్ఐ తీర్మానించింది.
దాంతో, 75 కిలోల విభాగంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న రవి దహియా షాక్‌లో ఉండిపోయాడు. రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయంతో టోక్యో ఒలింపిక్స్‌లో వెండి పతకంతో మెరిసిన అతడు ఈసారి విశ్వ క్రీడలకు దూరం అవుతున్నాడు. ఫైనల్ ట్రయల్స్ లేకపోవడంతో ఒలింపిక్స్‌కు వెళ్లే రెజ్లర్ల జాబితా ఖరారైంది.
ప్యారిస్ ఒలింపిక్స్ పోటీలకు వెళ్తున్న రెజ్లర్లలో ఎవరెవరు ఉన్నారంటే..? వినేశ్ ఫోగట్(50 కిలోలు), అంతిమ్ పంగల్(53 కిలోలు), అన్షు మాలిక్(57 కిలోలు), నిశా దహియా(68 కేజీ), రీతికా హుడా(76 కిలోలు), అమన్ షెరావత్(57 కిలోలు)లు విశ్వ క్రీడల్లో బరిలోకి దిగనున్నారు.
‘భారత రెజ్లర్లలో దాదాపు అందరూ ఈ మధ్యే ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించారు. వాళ్లు క్వాలిఫై అయి ఏడాది కాలేదు. అందుకని రెజ్లర్ల ఫిట్నెస్ను పరీక్షించడం సరికాదు. ఒక్కోసారి రెజ్లర్లు ఫామ్ కోల్పోతారు. అంతేకాదు గాయపడే చాన్స్ కూడా ఉంది. అందుకనే ఫైనల్ ట్రయల్స్ నిర్వహించంలో అర్ధం లేదు’ అని ద్రోణాచార్య అవార్డు గ్రహీత లలిత్ కుమార్(Lalith Kumar) వెల్లడించాడు. లలిత్ ప్రస్తుతం ఢిల్లీలోని ఛతర్సాల్ స్టేడియంలో హెడ్‌కోచ్‌గా పనిచేస్తున్నాడు.