Presidential Elections | ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణంపాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ దేశం ముందస్తు ఎన్నికలకు సిద్ధమైంది. వచ్చే నెల అంటే జూన్ 28న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అధికారిక మీడియా ‘ఐఆర్ఎన్ఏ’ వెల్లడించింది. దేశంలో 14వ అధ్యక్ష ఎన్నికల తేదీని న్యాయ, కార్యనిర్వాహక, శాసనాధికారుల అధిపతుల సమావేశంలో ఖరారు చేసినట్లు పేర్కొంది. అభ్యర్థుల నమోదు మే 30న ప్రారంభమవుతుందని, జూన్ 12 నుంచి 27 మధ్య ఎన్నికల ప్రచారాలు జరుగుతాయని ఐఆర్ఎన్ఏ పేర్కొంది.
ఇక ఇరాన్ రాజ్యాంగం ప్రకారం.. ఒకవేళ అధ్యక్షుడు మరణిస్తే 50 రోజుల్లో కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అప్పటి వరకూ ఉపాధ్యక్షుడే.. తాత్కాలిక అధ్యక్షుడి పాత్రను పోషిస్తారు. మరోవైపు రైసీ మృతి నేపథ్యంలో ఫస్ట్వైస్ప్రెసిడెంట్ మొమమ్మద్ మొఖ్బర్ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆమోదం తర్వాత తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలను మొఖ్బర్కు అప్పగించారు.
ఇస్లామిక్ రిపబ్లిక్ దేశమైన ఇరాన్లో.. సుప్రీం లీడరే అతి కీలకం. దేశీయ, విదేశీయ వ్యవహారాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలే ముఖ్యం. దేశాధ్యక్షుడి కన్నా.. అధికారాలన్నీ సుప్రీం నేత ఆధీనంలోనే ఉంటాయి. మాజీ అధ్యక్షుడు హసన్ రౌహనీ, సుప్రీం నేత ఖమోనీ మధ్య గతంలో సరైన సంబంధాలు ఉండేవికాదు. కానీ అధ్యక్షుడు రైసీ మాత్రం ఖమేనీతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఇక ఇరాన్ సర్కారులో మూడు శాఖలు కీలకమైనవి. దేశ ఉపాధ్యక్షుడు, పార్లమెంట్ స్పీకర్, న్యాయ వ్యవస్థ అధిపతి.. ఈ ముగ్గురూ ముఖ్యమైనవాళ్లు. ఈ ముగ్గురు అనుమతితోనే .. పాలనలో మార్పులు తేవాల్సి ఉంటుంది.
కాగా, ఆదివారం సాయంత్రం ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. అజర్ బైజాన్ సరిహద్దులో డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రైసీతోపాటు మొత్తం 9 మంది మరణించారు. భారీ వర్షం, పొగ మంచు కారణంగా హెలికాప్టర్ క్రాష్ అయినట్లు ఇరాన్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Also Read..
Asma Al-Assad | లుకేమియా బారినపడ్డ సిరియా ఫస్ట్ లేడీ.. నాలుగేండ్ల క్రితం బ్రెస్ట్ క్యాన్సర్..
Ali Bagheri | విదేశాంగ మంత్రిగా అలీ బఘేరి.. ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వం
Ebrahim Raisi | రైసీ మృతితో ఇరాన్లో సంబరాలు.. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్న ఇరానియన్లు.. !