Asma Al-Assad : సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ సతీమణి, ఆ దేశ ప్రథమ పౌరురాలు ఆస్మా అల్ అసద్ లుకేమియా బారినపడ్డారు. నాలుగేండ్ల క్రితమే బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడి కోలుకున్న ఆమె.. ఇప్పుడు లుకేమియా బారినపడటం గమనార్హం. ఆస్మా.. లుకేమియా బారినపడ్డ విషయాన్ని సిరియా అధ్యక్ష కార్యాలయం మంగళవారం వెల్లడించింది.
‘సిరియా ప్రథమ పౌరురాలు ఆస్మా లుకేమియా బారినపడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది’ అని సిరియా ప్రెసిడెంట్ ఆఫీస్ తన ప్రకటనలో పేర్కొన్నది. లుకేమియా అనేది తెల్లరక్త కణాల్లో వచ్చే ఒక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ అని వెల్లడించింది. ప్రస్తుతం ఆస్మా ప్రత్యేక ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ ట్రీట్మెంట్ సందర్భంగా ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండేందుకు సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉంది.
అందుకే ఆమె ప్రత్యక్షంగా పాల్గొనాల్సి ఉన్న కార్యక్రమాలన్నింటిని తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. ఆస్మా అసద్ 2019లో బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడ్డారు. ఏడాదిపాటు చికిత్స పొందిన అనంతరం కోలుకున్నారు. అయితే నాలుగేండ్లు తిరగకుండా ఆమె ఇప్పుడు లుకేమియా బారినపడ్డారు. 1975లొ బ్రిటన్లో జన్మించిన ఆస్మా.. సిరియాలో 2011లో తలెత్తిన సివిల్ వార్ సందర్భంగా అసద్ ప్రభుత్వం తరఫున హక్కుల న్యాయవాదిగా పనిచేశారు.