సెయింట్ లూసియా: టీ20 ప్రపంచకప్ ఆతిథ్య దేశం వెస్టిండీస్.. ఈ టోర్నీలో ఆఖరి గ్రూప్ దశ మ్యాచ్‌ను ఘనవిజయంతో ముగించింది. ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమన్నదే లేకుండా తమ బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన అఫ్గానిస్థాన్‌కు ఓటమి రుచి చూపించింది. సెయింట్ లూసియా వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో అఫ్గాన్‌పై 104 పరుగుల తేడాతో గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నికోలస్ పూరన్ (53 బంతుల్లో 98, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) మరోసారి పూనకమొచ్చినట్టు ఊగిపోయి తృటిలో శతకాన్ని చేజార్చుకోగా జాన్సన్ చార్లెస్ (27 బంతుల్లో 43, 8 ఫోర్లు) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. 20 ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో అఫ్గానిస్థాన్.. 16.2 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (38) టాప్ స్కోరర్.
మ్యాచ్‌లో పూరన్ ఆటే హైలైట్. రెండో ఓవర్లోనే అజ్మతుల్లా.. బ్రాండన్ కింగ్ (7)ను బౌల్డ్ చేయడంతో క్రీజులోకి వచ్చిన పూరన్.. చార్లెస్‌తో కలిసి వీరవిహారం చేశాడు. అజ్మతుల్లానే వేసిన 4వ ఓవర్లో ఈ జోడీ 36 పరుగులు పిండుకుని 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ రికార్డును సమం చేసింది. ఇందులో 26 పరుగులు పూరన్ చేసినవి కాగా మిగితావి వైడ్స్, నోబాల్, లెగ్ బైస్ ద్వారా వచ్చినవి. ఇదే జోరు కొనసాగించిన పూరన్.. 32 బంతుల్లో అర్థ సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయాడు. రషీద్ 18వ ఓవర్లో 6, 4, 6, 6 బాదిన అతడు.. నవీనుల్ 20వ ఓవర్లో రెండు సిక్సర్లతో 98కి చేరాడు. కానీ నాలుగో బంతికి రనౌట్ అవడంతో నిరాశగా వెనుదిరిగాడు. చేదనలో అఫ్గాన్ బ్యాటర్లు తేలిపోయారు. ఒబెడ్ మెక్కాయ్ (3/14), అకీల్ హోసెన్ (2/21), గుడకేశ్ మోటీ (2/28) విజృంభించడంతో ప్రత్యర్థి బ్యాటర్లు విలవిల్లాడారు.
వెస్టిండీస్: 20 ఓవర్లలో 218/5 (పూరన్ 98, చార్లెస్ 43, గుల్బాదిన్ 2/14, నవీనుల్ 1/41).
అఫ్గానిస్థాన్: 16.2 ఓవర్లలో 114 ఆలౌట్ (జద్రాన్ 38, అజ్మతుల్లా 23, మెక్కాయ్ 3/14, అకీల్ 2/21)