ముల్తాన్: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్ 127 రన్స్ తేడాతో దారుణంగా ఓటమి పాలైంది. కానీ ఆ టెస్టులో విండీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఓ అరుదైన రికార్డు(Test Cricket Record)ను నెలకొల్పారు. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటన మొదటిసారి జరిగింది. పాక్ చేతిలో చిత్తుగా ఓడినా.. విండీస్ బౌలర్లు గుదకేశ్ మోతే, జోమెల్ వారికన్, జేడన్ సీల్స్ మాత్రం.. రికార్డు సృష్టించారు. బౌలింగ్‌లో కాదు.. వాళ్లు బ్యాటింగ్‌లో రాణించారు. బ్యాటింగ్ ఆర్డర్లో చివరకు వచ్చిన ఆ ముగ్గురూ.. టాప్ ఆర్డర్ బ్యాటర్ల కన్నా వ్యక్తిగతంగా ఎక్కువ స్కోర్లు చేశారు.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఓ దశలో విండీస్ 66 రన్స్‌కే 8 వికెట్లు కోల్పోయింది. కానీ చివరకు ఆ జట్టు 137 రన్స్ చేసి ఆలౌటైంది. అయితే 9, 10, 11వ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ముగ్గురూ రెండంకెల స్కోర్ చేశారు. 9వ నెంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన మోతే 19 రన్స్, 10వ నెంబర్లో వారికన్ 31 రన్స్, 11వ నెంబర్లో సీల్స్ 22 రన్స్ చేశారు. టాప్ ఆర్డర్‌లోని 8 మంది బ్యాటర్లలో ఎవరు కూడా వ్యక్తిగతంగా 11 రన్స్ దాటలేదు. టెస్టు క్రికెట్లో తొలిసారి.. చివరి ముగ్గురు బ్యాటర్ల నుంచి అత్యధిక స్కోర్లు నమోదు అయ్యాయి. టెస్టు క్రికెట్లో చివరి ఇద్దరు బ్యాటర్లు టాప్ రన్ స్కోరర్లుగా నిలవడం ఇది మూడవ సారి. అయితే ఈ ముగ్గురు బ్యాటర్లూ.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ 123 రన్స్‌కు ఆలౌట్ కావడంతో.. భారీ తేడాతో ఓటమి పాలైంది.
ముల్తాన్ టెస్టులో ఓడినా.. విండీస్ బౌలర్ వారికన్ మాత్రం రికార్డు సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసుకున్న అతను.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఆ టెస్టులో అతను 101 రన్స్ ఇచ్చి 10 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. జనవరి 25వ తేదీ నుంచి ముల్తాన్‌లోనే రెండో టెస్టు జరగనున్నది.