Sourav Ganguly | ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఓటమిపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. టెస్టు క్రికెట్లో భారత క్రికెటర్లు భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-3 తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన టెస్టులో భారీ లక్ష్యాన్ని నిర్దేశించి.. ట్రోఫీని నిలబెట్టుకునే అవకాశం ఉన్నది. అయినా టీమిండియా కేవలం 162 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియాకు నిర్దేశించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడి స్వల్ప లక్ష్యాన్ని ఛేదించింది.
దాంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను కోల్పోయింది. కోల్‌కతా స్పోర్ట్స్ జర్నలిస్ట్ క్లబ్ మీడియా ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ భారత్ గెలవాలంటే బ్యాట్‌తో భారీ ప్రదర్శన చేయాల్సి ఉందని గంగూలీ పేర్కొన్నాడు. టెస్టుల్లో గెలవాలంటే సరిగ్గా బ్యాటింగ్ చేయాలన్నాడు. 170-180 పరుగులు చేస్తే టెస్టుల్లో గెలవలేరని.. 340-400 పరుగులు చేయాల్సిందేనని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సిడ్నీ టెస్టులో మిడిలార్డర్ వైఫల్యాన్ని గంగూలీ ఎత్తి చూపాడు.
ప్రతి ఒక్కరూ బ్యాట్‌తో రాణించాలన్నాడు. ఎవరినీ నిందించలేమని.. అందరూ పరుగులు సాధించాలన్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌పై ప్రశ్నించిన సమయంలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తనకు అర్థం కాలేదని.. అతనో గొప్ప ఆటగాడని.. కానీ, సమస్యను అధిగమిస్తాడని తాను నమ్ముతున్నానన్నాడు. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ వైదొలగడంపై.. గంగూలీ భారత కెప్టెన్ నిర్ణయాన్ని గౌరవిస్తూ.. అది అతని వ్యక్తిగత నిర్ణయమని.. ఏం చేయాలో అతని తెలుసునన్నాడు. కోచ్ గంభీర్ ప్రదర్శనపై ప్రశ్నించగా.. జట్టు ప్రదర్శనపై మాత్రమే వ్యాఖ్యానించాడు. జట్టు రాణించాలని.. ఇంతకన్నా ఏం చెప్పగలనన్నాడు. సిరీస్‌లో భారత బ్యాటింగ్‌పై తీవ్ర ఆందోళన నెలకొంది.. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్ మరింత కష్టపడాలని గంగూలీ సూచించాడు.