న్యూఢిల్లీ: ప్రతీ అంశాన్ని తనదైన శైలిలో విశ్లేషించే భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్..మరో సెటైర్ వేశాడు. క్రీడా ప్రముఖలు రాజకీయాల్లోకి వచ్చే ముందు తమ అహాన్ని వీడాలని సూచించాడు. ప్రజల కోసం పనిచేయాలనుకునే వారు పార్ట్‌టైమ్‌గా గాకుండా నిత్యం అందుబాటులో ఉండే విధంగా మసలుకోవాలని ఒక రకంగా బీజేపీ ఎంపీ గంభీర్‌ను ఉదహరిస్తూ వ్యాఖ్యానించాడు. ట్విటర్లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘రాజకీయాల్లోకి రావడం నాకు ఇష్టం లేదు.
గతంలో రెండు సార్లు ప్రధాన పార్టీలు నన్ను కలిసి పోటీచేయాలంటూ కోరాయి. చాలా మంది సినీ, క్రీడా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం వృథా. ఎందుకంటే చాలా మంది ప్రజల కోసం పనిచేసేందుకు గాకుండా అధికారం కోసం రాజకీయాలను ఎంచుకుంటున్నారు. అందులో కొంత మంది మాత్రమే ప్రజల కోసం పాటుపడుతుండగా, చాలా వరకు పార్ట్‌టైమ్ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. అంతేగానీ అవసరం వచ్చినప్పుడు పార్ట్‌టైమ్ ఎంపీ లాగా వ్యవహరించడం నా వల్ల కాదు’ అంటూ సెహ్వాగ్ ట్విట్టర్లో రాసుకొచ్చాడు. కాగా రానున్న ప్రపంచకప్‌లో మన క్రికెటర్ల జెర్సీలపై ఇండియా అని కాకుండా భారత్ అని ముద్రించాలని సెహ్వాగ్ సూచించాడు.