Virender Sehwag : భారత గడ్డపై జరుగనున్న వన్డే వరల్డ్ కప్(ICC ODI WC 2023) షెడ్యూల్ ఈరోజు వచ్చేసింది. ముంబై వేదికగా ఐసీసీ, బీసీసీఐ వరల్డ్ కప్ తేదీలను ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్(Muttiah Muralitharan)తో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 2011లో భారత జట్టు వరల్డ్ కప్ గెలవడం వెనక ఉన్న కిచిడీ(khichdi) స్టోరీని వీరూ వెల్లడించాడు.
అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) టోర్నీ ఆసాతం కిచిడీ మాత్రమే తిన్నాడని అతను చెప్పాడు. ‘ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని బలంగా నమ్ముతారు. అదే విషయాన్ని పక్కాగా అనుసరిస్తారు కూడా. అందరిలానే ధోనీకి ఒక నమ్మకం ఉంది. అదేంటంటే..? కిచిడీ. అవును.. అతను వరల్డ్ కప్ టోర్నీ మొత్తం అదే ఆహారం తిన్నాడు’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని అతను ధోనీని అడిగాడట.
2011 వరల్డ్ కప్ ఫైనల్లో సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించిన ధోనీ
దానికి మిస్టర్ కూల్ కెప్టెన్… ‘నేను పరుగులు సాధించకున్నా కూడా ఈ కిచిడీ నమ్మకం పనిచేస్తోంది. మనం మ్యాచ్‌లు గెలుస్తున్నాం’ అని నవ్వుతూ బదులిచ్చాడని సెహ్వాగ్ తెలిపాడు. ఈ విధ్వంసక ఓపెనర్ 2011 వరల్డ్ కప్‌లో 380 రన్స్ కొట్టాడు. అయితే.. కీలమైన ఫైనల్ పోరులో డకౌట్‌గా వెనుదిరిగాడు.
వరల్డ్ కప్ ఫైనల్లో(2011) భారత జట్టు శ్రీలంకతో తలపడింది. ముంబైలోని వాంఖడే(Whankhede) స్టేడియంలో ఎంఎస్ ధోనీ సంచలన బ్యాటింగ్‌తో భారత జట్టుకు వరల్డ్ కప్ అందించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో యువరాజ్ సింగ్(Yuvaraj Singh) కంటే ముందొచ్చిన మహీ ధనాధన్ ఆటతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. గౌతం గంభీర్(97)తో కలిసి టీమిండియాను విజయం వైపు నడిపించాడు. తనదైన స్టయిల్లో హెలిక్యాప్టర్ షాట్‌తో సిక్స్ బాది మ్యాచ్‌ను ముగించాడు. దాంతో, భారత డగౌట్ సహా కోట్లాది మంది భారతీయులు సంబురాల్లో మునిగి తేలారు. అప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో 150 పరుగులే చేసిన ధోనీ ఫైనల్లో చెలరేగడం విశేషం. ఈ ఏడాది సొంత గడ్డపై మళ్లీ వరల్డ్ కప్ జరగబోతోంది. దాంతో, టీమిండియా మూడోసారి ట్రోఫీని ముద్దాడాలని అభిమానులు ఆశిస్తున్నారు. వరల్డ్ కప్ టోర్నమెంట్ అక్టోబర్ 5న ప్రారంభమై నవంబర్ 19న ముగియనుంది.