Ashes Series : లార్డ్స్ స్టేడియం(Lords Stadium) వేదికగా యాషెస్(Ashes) రెండో టెస్టు రేపు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయంపై కన్నేసిన ఇంగ్లండ్ ఈరోజు తుది జట్టును ప్రకటించింది. తొలి టెస్టులో గాయపడిన మోయిన్ అలీ(Moeen Ali) ఇంకా కోలుకోలేదు. దాంతో, అతడి స్థానంలో 25 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ జోష్ టంగ్(Josh Tongue)ను తుది జట్టులోకి తీసుకుంది. ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో టంగ్ ఆరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్లతో సత్తా చాటాడు.
మొదట రెహాన్ అహ్మద్(Rehan Ahmed)ను తీసుకుంటారనే వార్తలు వినిపించాయి. అయితే.. కోచ్ మెక్కల్లం, కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) మాత్రం టంగ్ వైపే మొగ్గు చూపారు. సిరీస్ సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ఒత్తిడి అంతా ఇంగ్లండ్ పైనే ఉండనుంది. రెండో టెస్టులో ఇంగ్లండ్ పూర్తిగా పేసర్లతోనే బరిలోకి దిగనుంది.
ఇంగ్లండ్ జట్టు: బెన్ డకెట్, జాక్ క్రాలే, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), స్టువార్ట్ బ్రాడ్, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్, జేమ్స్ అండర్సన్.
📋 We can confirm our team for the second Ashes Test match at Lord’s.
Congratulations, Josh Tongue 🤝 #EnglandCricket | #Ashes
— England Cricket (@englandcricket) June 27, 2023
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ అనూహ్యంగా ఓటమి పాలైంది. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన స్టోక్స్‌కు పర్యాటక జట్టు గట్టి షాక్ ఇచ్చింది. అవును.. బాజ్‌బాల్ ఆటతో అదరగొడతామని బీరాలు పలికిన స్టోక్స్ సేన నాథన్ లియాన్, కమిన్స్ దెబ్బకు చతికిలపడింది. దాంతో, ఇంగ్లండ్ రెండో టెస్టులో గెలిచి సిరీస్‌లో నిలవాలనే పట్టుదలతో ఉంది.
తొలి టెస్టులో కమిన్స్ విజయానందం
మరోవైపు అసమాన పోరాటంతో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన ఆస్ట్రేలియా జోరు కొనసాగించాలని అనుకుంటోంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్(44 నాటౌట్), నాథన్ లియాన్ తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలిపించారు. దాంతో, ఆసీస్ ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో కమిన్స్ సేన అదే జట్టుతో ఆడనుందా? మిచెల్ స్టార్క్ జట్టులోకి వస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.