న్యూఢిల్లీ, డిసెంబర్ 23: బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్యలభ్యతను పెంచేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లను ప్రకటించింది. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 22 మధ్య ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంవో) ద్వారా రూ.2 లక్షల కోట్ల సెక్యూరిటీలను కొంటామని మంగళవారం పేర్కొన్నది. అలాగే 10 బిలియన్ డాలర్ల మేర డాలర్-రూపీ క్రయవిక్రయాల మార్పిడి వేలాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
నిజానికి ఇప్పటికే లక్ష కోట్ల రూపాయల ప్రభుత్వ సెక్యూరిటీల ఓఎంవో కొనుగోలు వేలాలు, మూడేండ్లకుగాను 5 బిలియన్ డాలర్ల మేర డాలర్-రూపీ క్రయవిక్రయాల మార్పిడి వేలాన్ని సెంట్రల్ బ్యాంక్ చేపట్టింది. కాగా, డిసెంబర్ 29, జనవరి 5, 12, 22 తేదీల్లో రూ.50,000 కోట్ల చొప్పున నాలుగు విడుతల్లో మొత్తం రూ.2 లక్షల కోట్ల ప్రభుత్వ సెక్యూరిటీల వేలాలను ఆర్బీఐ నిర్వహించనున్నది. అంతేగాక జనవరి 13న మూడేండ్ల కాలవ్యవధికిగాను 10 బిలియన్ డాలర్ల డాలర్-రూపీ క్రయవిక్రయాల మార్పిడి వేలం జరుగనున్నది.