Virat Kohli Mother: స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి రెండు టెస్టులకు ఎంపికైనా వ్యక్తిగత కారణాల రీత్యా ఈ మ్యాచ్‌లకు దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. అయితే కోహ్లీ కుటుంబంలో ఎవరికి ఏమైంది..? అన్నది బీసీసీఐ స్పష్టతనివ్వలేదు. కానీ గత కొన్ని రోజులుగా కోహ్లీ తల్లికి ఆరోగ్యం బాగోలేదని, ఆమె తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స తీసుకుంటున్నారని, అందుకే కోహ్లీ ఇంగ్లండ్‌తో రెండు టెస్టులకు దూరమయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోహ్లీ తల్లి అనారోగ్యంతో అతడు రెండు టెస్టులతో పాటు సిరీస్ మొత్తానికి దూరమవనున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా దీనిపై కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ స్పందించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా వికాస్.. తన తల్లి ఆరోగ్యంపై పోస్ట్ పెట్టాడు.
వికాస్ స్పందిస్తూ… ‘అందరికీ నమస్తే. మా అమ్మ ఆరోగ్యం బాగోలేదని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. కానీ అవి అవాస్తవం. మా అమ్మ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. అంతేగాక నేను ప్రతి ఒక్కరితో పాటు మీడియాకూ ఒక విషయం చెప్పదలుచుకున్నా. దయచేసి సరైన సమాచారం లేకుండా ఇలాంటి వార్తలను షేర్ చేయొద్దు..’ అని పేర్కొన్నాడు. వికాస్ పోస్టు చేయడంతో కోహ్లీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్నిరోజులుగా తాము కోహ్లీ తల్లికి అనారోగ్యంగా ఉందన్న వార్తలు వింటూ ఆందోళనకు గురయ్యామని కామెంట్స్ చేస్తున్నారు.
హైదరాబాద్, వైజాగ్ టెస్టులకు కోహ్లీ గైర్హాజరీ నేపథ్యంలో భారత్ అతడి రిప్లేస్మెంట్ కోసం తంటాలు పడుతోంది. తొలి టెస్టులో అతడి స్థానంలో గిల్ ను ఆడించినా అతడు విఫలమయ్యాడు. ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ మిస్ చేసుకున్న రవీంద్ర జడేజాతో పాటు కెఎల్ రాహుల్‌లు రెండో టెస్టుకు దూరమవడంతో భారత్.. రజిత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్‌లను జట్టులోకి తీసుకుంది. ఈ ఇద్దరిలో తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.