భారత అత్యుత్తమ టెస్టు కెప్టెన్లలో ఒకడైన విరాట్ కోహ్లీ.. సఫారీ టూర్లో పరాజయం తర్వాత అనూహ్యంగా కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఈ నిర్ణయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ తాజాగా స్పందించాడు.
కోహ్లీ అద్భుతమైన కెప్టెన్ అని, అతను మైదానంలో అడుగు పెడితే వంద శాతం కష్టపడతాడని కొనియాడాడు. అతని కింద ఆడటం చాలా మంచి అనుభూతి అన్నాడు. వివిధ ఫార్మాట్లలో టీమిండియాకు ఇద్దరు కెప్టెన్లు ఉండటం కష్టమని ఒకప్పుడు ధోనీ అన్న మాటలను ప్రస్తావించిన కార్తీక్.. ఈ విషయంలో తాను మాట్లాడటం సరికాదని, కానీ టెస్టు కెప్టెన్సీ వదులుకోవడానికి కోహ్లీ వద్ద సరైన కారణం ఉండే ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
భారత టెస్టు జట్టును బలమైన స్థానంలో నిలిపిన ఘనత కోహ్లీదే అని మెచ్చుకున్నాడు. కాగా, శ్రీలంక జట్టు భారత పర్యటనలో భాగంగా బెంగళూరులో జరిగే టెస్టు మ్యాచ్.. కోహ్లీ కెరీర్లో 100వ టెస్టు కావడం గమనార్హం.
ఈలోపు ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్ జట్టుతో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో తొలి వన్డేతో భారత జట్టు ఒక అరుదైన ఘనత సాధిస్తుంది. ఈ తొలి మ్యాచ్ భారత జట్టుకు వన్డే ఫార్మాట్లో 1000వ మ్యాచ్. ఈ ఫార్మాట్లో ఇన్ని మ్యాచులు ఆడిన ఏకైక దేశంగా భారత్ ఘనత సాధిస్తుంది.