Virat Kohli | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ సైతం రిటైర్మెంట్ ప్రకటించబోడుతున్నాడని.. ఈ మేరకు బీసీసీఐకి సమాచారం అందించినట్లుగా తెలుస్తున్నది. అయితే, బోర్డు ఉన్నతాధికారులు తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలని విరాట్‌కు సూచించినట్లు సమాచారం. త్వరలో ఇంగ్లాండ్ పర్యటన నేపథ్యంలో విరాట్‌ను తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని బీసీసీఐ కోరినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ సైతం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు జట్టును ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు త్వరలోనే సమావేశం కానున్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ నుంచి కోహ్లీ తన టెస్టుల భవిష్యత్‌ను పరిశీలిస్తున్నాడు. ఆ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్.. ఆ తర్వాత పెద్దగా పరుగులు చేయలేకపోయాడు.
పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత కోహ్లీ మిగిలిన నాలుగు టెస్ట్ మ్యాచుల్లో ఏడు ఇన్నింగ్స్‌లలో 90 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ ఐదు టెస్టుల్లో తొమ్మిది ఇన్నింగ్స్‌లో 23.75 సగటుతో 190 పరుగులు చేశాడు. అంతకు ముందు న్యూజిలాండ్‌లో భారత పర్యటనలో కోహ్లీ బ్యాట్‌తో రాణించలేకపోయాడు. మూడు టెస్ట్‌ల్లోని ఆరు ఇన్నింగ్స్‌లో 15.50 సగటుతో 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో కోహ్లీ సైతం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా రిటైర్మెంట్ ప్రకటిస్తే భారత జట్టుకు ఇబ్బందికరంగా మారనున్నది. భారత క్రికెట్లో ఒక అధ్యాయం ముగుస్తుంది. గత బుధవారం రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కివీస్, ఆస్ట్రేలియా పర్యటనలలో రాణించలేకపోయిన రోహిత్.. ఈ నిర్ణయం తీసుకున్నాడు. రోహిత్, విరాట్ ఇద్దరూ ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. విరాట్ సైతం టెస్టుల నుంచి రిటైర్ అయితే.. ఇద్దరూ ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపించనున్నారు.
ఇంగ్లాండ్ టూర్‌కు రోహిత్‌ను కెప్టెన్‌గా నియమించేందుకు సెలెక్టర్లు ఇష్టపడలేదని.. కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే పంపాలని నిర్ణయించినట్లు పలు నివేదికలు తెలిపాయి. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో రోహిత్ మూడు మ్యాచ్‌ల్లో 15.17 సగటుతో 91 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడు టెస్టుల్లో 6.20 సగటుతో 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ నేపథ్యంలో యువ ఆటగాళ్లకు కెప్టెన్‌గా ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. రోహిత్ స్థానంలో టాప్ ఆర్డర్‌లోకి కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ ఆడనున్నారు. అయితే, మిడిల్ ఆర్డర్లో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉన్న ఏకైక రిషబ్ పంత్ మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ పర్యటనలో మిడిల్ ఆర్డర్ బాధ్యత శ్రేయాస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్, నితీష్‌రెడ్డి తదితర ఆటగాళ్లపై పడనున్నది. రవీంద్ర జడేజా సైతం వీరికి జతకానున్నాడు.
ఇక టెస్టు కెప్టెన్ రేసులో శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. అలాగే, జస్ప్రీత్ బుమ్రా సైతం రేసులో ఉన్నాడు. కోహ్లీ నిర్ణయాన్ని మార్చుకోకపోతే మార్గనిర్దేశం చేసేవారుండరు. 2014 డిసెంబర్ తర్వాత రోహిత్, కోహ్లీ ఇద్దరు లేకుండానే ఇంగ్లాండ్‌కు జట్టుకు వెళ్తుంది. కోహ్లీ డిసెంబర్ 2014లో భారత టెస్ట్ జట్టు కెప్టెన్‌గా నియామకమయ్యాడు. ఫిబ్రవరి 2022లో రోహిత్ కెప్టెన్ బాధ్యతలు స్వీకరించాడు.
విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున 123 టెస్టులు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. గత ఐదేళ్లలో విరాట్ సగటు తగ్గుతూ వస్తుంది. ఈ సమయంలో 37 టెస్టుల్లో మూడు సెంచరీల సహాయంతో 1,990 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆఫ్-స్టంప్ వెలుపల బంతిని ఆడేందుకు ప్రయత్నించి కోహ్లీ ఏడుసార్లు అవుట్ అయ్యాడు.